తిరుమలగిరి ఎస్‌ఐ అటాచ్?
తిరుమలగిరి ( తుంగతుర్తి): విధుల్లో అలసత్వం ప్రదర్శించడంతో తిరుమలగిరి ఎస్‌ఐ సీహెచ్. వెంకటేశ్వర్లును ఎస్పీ కార్యాలయానికి గురువారం అటాచ్ చేసినట్లు తెలిసింది. వెంకటేశ్వర్లు మార్చి 13న తిరుమలగిరిలో బాధ్యతలు స్వీకరించారు. వచ్చినపప్పటి నుంచి సివిల్ వివాదాలు, కుటుంబ పంచాయతీలలో తల దూర్చి ఇరువురి నుంచి మధ్య వర్తుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీస్ స్టేషన్ లో సిబ్బందితో సఖ్యతగా లేనట్లు తెలుస్తోంది. వెంకటేశ్వర్లు కంటే ముందు పనిచేసిన ఎస్‌ఐ సురేష్ పీడీఎస్ బియ్యంకేసులో బాధితుడి నుంచి డబ్బులు వసూలు చేస్తూ కానిస్టేబుల్ తో సహా పట్టుబడ్డారు. తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ కు వస్తున్న అధికారుల తీరుతో వరుస సంఘటనలు జరుగుతున్నా అధికారులు, సిబ్బందిలో మార్పు రావడంలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ధైర్యం కల్పించడమే ధ్యేయం
సూర్యాపేటటౌన్ : వేధింపులకు గురైన మహిళలు, బాలలకు నైతిక ధైర్యం కల్పించడమే పోలీస్ భరోసా సెంటర్ ధ్యేయమని జిల్లా ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ భరోసా సెంటర్, షీ టీమ్స్ కార్యాలయాన్ని ఎస్పీ పరిశీలించారు. మహిళలు, పిల్లల రక్షణకు తీసుకుంటున్న చర్యలు, కౌన్సిలింగ్ నిర్వహణ, అవగాహన కార్యక్రమాలను పరిశీలించి సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. ఎవరైనా వేధింపులకు గురిచేస్తే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు. సాంకేతికత ఆధారాలతో నాణ్యమైన దర్యాప్తును చేస్తున్నామని, ఫాస్ట్ ట్రాక్ లో మాదిరిగా నేరాల్లో త్వరగా శిక్షలు అమలయ్యేలా పోలీస్‌శాఖ పని చేస్తోందన్నారు. ఎస్పీ వెంట భరోసా సెంటర్ మహిళా ఏఎస్‌ఐ సైదావి, సిబ్బంది ఉన్నారు.
మత్స్యకారుల
సంక్షేమానికి కృషి
నేరేడుచర్ల : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా మత్స్యశాఖ అధికారి నాగులు పేర్కొన్నారు. గురువారం నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్నలోని చెరువులో ఎంపీడీఓ సోమసుందర్‌రెడ్డితో కలిసి చేప పిల్లలు వదిలారు. అనంతరం నాగులు మాట్లాడుతూ చేపల పెంపకం తో జీవనోపాధి దొరుకుతుందన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు రోజా, సుమలత, సతీష్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఆర్‌కే, నాగరాజు, సైదులు, హరిబాబు, నాగేశ్వర్‌రావు, శ్రీధర్, నాగయ్య, లచ్చయ్య, మట్టయ్య, వెంకటయ్య, రాంబాబు పాల్గొన్నారు.
ఎంజీయూ పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో పీజీ రెండవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం ఎంజీయూ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ విడుదల చేశారు. సెప్టెంబర్‌లో నిర్వహించిన పరీక్షలకు 1,160 మంది విద్యార్థులు హాజరు కాగా 794 మంది ఉత్తీర్ణత సాధించినట్లు సీఓఈ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ అలువాల రవి, డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఆకుల రవి, లక్ష్మీప్రభ, సంధ్యారాణి పాల్గొన్నారు.
తిరుమలగిరి ఎస్‌ఐ అటాచ్?


