ప్రమాదాల నివారణ మార్గం
అవగాహన కల్పిస్తున్నాం
సూర్యాపేటటౌన్ : జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులపై నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఆ కుటుంబం చిన్నాభిన్నమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలను కొంతవరకై నా నివారించాలనే ఉద్దేశంతో ఎస్పీ నరసింహ ప్రత్యేక చొరవతో 43 రోడ్డు భద్రతా కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు బ్లాక్ స్పాట్స్ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రమాదం జరిగితే వెంటనే స్పందించేలా ప్రణాళిక రూపొందించారు.
బ్లాక్ స్పాట్స్ ఇవీ..
జిల్లా వ్యాప్తంగా జాతీయ, గ్రామీణ రహదారులపై మొత్తం 43 బ్లాక్ స్పాట్‌లను పోలీసులు గుర్తించారు. వీటిలో..
● ఎన్‌హెచ్ 65పై టేకుమట్ల నుంచి రామారం రోడ్డు వరకు 23 బ్లాక్ స్పాట్స్
● ఎన్‌హెచ్ 167పై కోదాడ నుంచి చిల్లెపల్లి బ్రిడ్జి వరకు ఐదు బ్లాక్ స్పాట్స్
● ఎన్‌హెచ్ 365పై అర్వపల్లి నుంచి బిక్కుమళ్ల వరకు ఒకటి
● ఎన్‌హెచ్ 365 బిపై జనగామ ఎక్స్ రోడ్డు నుంచి తిరుమలగిరి(ఈదులపర్రెతండా )వరకు ఏడు బ్లాక్ స్పాట్స్
● ఎన్‌హచ్ 365పై టేకుమట్ల నుంచి మోతె వరకు నాలుగు బ్లాక్ స్పాట్స్
● ఎన్‌హెచ్ 930పై తిరుమలగిరి బిగ్గేరు వాగు నుంచి మామిడాల క్రాస్ రోడ్డు వరకు మూడు బ్లాక్ స్పాట్స్
ఒక్కో కమిటీలో 11 మంది
43 బ్లాక్ స్పాట్‌ల వద్ద 43 రోడ్డు భద్రత కమిటీలను వారం పది రోజుల క్రితం ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 11 మంది ఉన్నారు. వీరిలో స్థానిక పోలీస్ ఒకరు, రిటైర్డ్ టీచర్ ఒకరు, మహిళా ప్రతినిధులు ఇద్దరు, వ్యాపారుల నుంచి ఇద్దరు, స్వచ్ఛంద సంస్థల నుంచి ఇద్దరు, యూత్ ఆర్గనైజేషన్ నుంచి ఇద్దరు, రహదారుల సంస్థ ప్రతినిధుల నుంచి ఒకరు ఉన్నారు. ఈ కమిటీలు బ్లాక్‌స్పాట్‌ల వద్ద యాక్సిడెంట్లు జరగకుండా చర్యలు చేపడతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి.
పోలీసుల సూచనలు
● అతివేగంగా, నిద్రమత్తులో వాహనాలు నడపవద్దు.
● రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపవద్దు.
● హెల్మెట్, సీట్ బెల్ట్ విధిగా ధరించాలి.
● వాహన సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకెళ్లవద్దు.
● పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు.
● మద్యం మత్తులో వాహనాలు నడపరాదు.
● ఓవర్‌టేక్ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి.
● రాంగ్‌రూట్‌లో వాహనాలు నడపవద్దు.
● వాహనాలకు లైటింగ్, సైడ్ మిర్రర్స్ ఉండాలి.
● డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి.
రోడ్డు ప్రమాదాల నివారణకు కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ కమిటీల ద్వారా ప్రజలు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే ఈ కమిటీలు స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు ప్రథమ చికిత్స అందించడం, అంబులెన్స్‌లకు ఫోన్‌లు చేయడంలాంటి పనులు చేస్తున్నాయి.
– కె.నరసింహ, జిల్లా ఎస్పీ, సూర్యాపేట
హైవేలు, గ్రామీణ రహదారులపై 43 బ్లాక్ స్పాట్ల గుర్తింపు
ఫ 43 రోడ్డు భద్రతా కమిటీల ఏర్పాటు
ఫ ఒక్కో కమిటీలో 11మంది
ఫ బ్లాక్‌స్పాట్‌ల వద్ద వాహనదారులకు
అవగాహన సదస్సులు
ప్రమాదాల నివారణ మార్గం


