
వెలుగు దివ్వెల పండుగ
భానుపురి (సూర్యాపేట) : చీకటిని పారదోలి వెలుగులు నింపే దీపావళి రానే వచ్చింది. జిల్లావ్యాప్తంగా సోమవారం ఆనందంగా పండుగ జరుపుకునేందుకు జిల్లా ప్రజలు సన్నద్ధమయ్యారు. ప్రధానంగా మహిళలు నోములు, వ్రతాల కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకు కావాల్సిన అన్నిరకాల సామగ్రిని ఆదివారమే కొనుగోళు చేసుకున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాకేంద్రంలోని రహదారులన్నీ జన సంచారం, వాహనాల రాకపోకలతో కిటకిటలాడాయి. పండుగ కోసం పట్టణాల నుంచి పల్లెలకు చేరే ప్రజలతో ఆర్టీసీ బస్టాండ్లు రద్దీగా మారాయి. ఇక నోములు, వ్రతాల కోసం ప్రమిదలు, పూలు, బొమ్మలు, ఇతర సామగ్రి కొనుగోళ్లతో ప్రధాన సెంటర్లలో పండుగ సందడి నెలకొంది. అలాగే కోదాడ, తుంగతుర్తి, హుజూర్‌నగర్, తిరుమలగిరి పట్టణాలు, మండల కేంద్రాల్లోని ప్రధాన రహదారుల్లో పండుగ వాతావారణం సంతరించుకుంది.
కిటకిటలాడిన టపాసుల దుకాణాలు
దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చుతుంటారు. ఇందుకోసం వేలాది రూపాయలను వెచ్చిస్తారు. ప్రజల అభిరుచి మేరకు బాణసంచా వ్యాపారులు భారీగా టపాసులు, క్రాకర్స్ దిగుమతి చేసుకుంటారు. విక్రయానికి గాను ప్రత్యేక దుకాణాలను ఏర్పాటు చేస్తుండగా.. ఈ యేడు సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రత్యేకంగా దుకాణాలను ఏర్పాటు చేసి వ్యాపారులకు కేటాయించారు. ఈ దుకాణాలకు ఉదయం నుంచే సూర్యాపేట పట్టణమే కాకుండా చుట్టపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి జనం వచ్చి టపాసులను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం నుంచి టపాసులు దుకాణాలు కిటకిటలాడాయి.
అన్నింటికీ ఎక్కువే..
దీపావళి అంటేనే నోములు, వ్రతాలకు ప్రసిద్ధి. ఈ సందర్భంగా లక్ష్మీదేవీకి పూజలు చేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో ప్రమిదల కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపగా.. జిల్లా కేంద్రంతోపాటు ప్రధాన పట్టణాల్లోని రహదారులు వెంట ఏర్పాటుచేసిన దుకాణాల్లో పూజ సామగ్రికి అధిక ధరలు ఉన్నాయి. చిన్నవి డజన్ ప్రమిదలు దాదాపు రూ.100ల వరకు విక్రయించారు. పెద్దవి నాలుగింటికి రూ.80 వరకు ధర పలుకుతుంది. పూజ కోసం వాడే పూలు సైతం ఒక మూర రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయించడంతో తప్పని పరిస్థితుల్లో మహిళలు కొనుగోలు చేశారు. ఇక దీపావళికి కుటుంబంలోని ప్రతిఒక్కరూ కాల్చే టపాసుల ధరలు చుక్కలను అంటాయి. జీఎస్టీ స్లాబ్‌ల కుదింపుతో టపాసుల ధరలు తగ్గుతాయనుకుంటే దీపావళి, కార్తీక మాసం వ్రతాలు, నోముల కారణంగా వ్యాపారులు ధరలు పెంచి అమ్ముతుండడంతో జనం బెంబేలెత్త్తిపోతున్నారు.
నేడు దీపావళి పర్వదినం
ఫ నోములు, వ్రతాలకు సిద్ధమైన ప్రజలు
ఫ మార్కెట్‌లో పూలు, ప్రమిదల కొనుగోలు
ఫ టపాసుల దుకాణాలు కిటకిట
ఫ అధిక ధరలతో జనం బెంబేలు
ఫ అంతటా సందడి వాతావరణం

వెలుగు దివ్వెల పండుగ