
జాబ్‌మేళాపై విస్తృత ప్రచారం చేయండి
22న మంత్రి సమావేశం
భానుపురి (సూర్యాపేట) : హుజూర్‌నగర్‌లో ఈనెల 25వ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్‌మేళాపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మెగా జాబ్‌మేళా నిర్వహణపై అదనపు కలెక్టర్ కె.సీతారామారావుతో కలిసి సంబంధిత అధికారులతో ఆదివారం సూర్యాపేట కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. హుజూర్‌నగర్‌లోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ (సబ్ రిజిస్టర్ కార్యాలయం వెనుక)లో ఉదయం 8 గంటల నుంచి జాబ్‌మేళా ప్రారంభమవుతుందన్నారు. ఈ మేళాకు రాష్ట్రంలోని 150 పెద్ద కంపెనీలు రానున్నాయని, 5వేల వరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని ఆయన వెల్లడించారు.
ప్రచారం చేస్తేనే మేలు..
ఈ జాబ్ మేళాకు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, ఎంబీఏ, బీటెక్, ఫార్మసీ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణత కలిగిన 18నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న నిరుద్యోగ యువత అర్హులని వివరించారు. మేళాపై విస్తృత ప్రచారం నిర్వహిస్తేనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మంది నిరుద్యోగలు వస్తారన్నారు. అన్ని పట్టణాల్లో జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఫ్లెక్సీ బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే జాబ్‌మేళా వాల్‌పోస్టర్లు ముద్రించి బస్సులు, ఇతర వాహనాలకు, కళాశాలల వద్ద అతికించాలని చెప్పారు.
అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం
జాబ్ మేళాకు వచ్చే నిరుద్యోగ యువతకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, జాబ్‌మేళా నిర్వహించనున్న పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే ఉన్న స్వర్ణ వేదిక ఫంక్షన్ హాలులో ఉదయం అల్పాహారం మొదలుకొని, మధ్యాహ్న భోజనం, అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిరుద్యోగ యువత జాబ్ మేళాకు వచ్చి ఉద్యోగాలు పొందే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. జాబ్‌మేళాకు హాజరయ్యే వారు 5 సెట్ల రెజ్యుమ్‌తో పాటు ఇటీవలి కాలంలో తీసుకున్న రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌తో సహా హాజరు కావాలని కోరారు.
జాబ్ మేళా నిర్వహణపై ఈనెల 22 ఉదయం 11 గంటలకు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూర్యాపేటలో ఉమ్మడి జిల్లాలోని కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల ఇంటర్మీడియట్ విద్యాధికారులతో సమన్వయం చేసుకొని అంతా హాజరయ్యేలా చూడాలన్నా రు. ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు మేళా నిర్వహణపై శ్రద్ధవహించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఆర్డీఓ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎక్కువ మంది నిరుద్యోగులు
హాజరయ్యేలా చూడాలి
ఫ టెలీ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్
తేజస్ నంద్‌లాల్ పవార్