
పనుల గుర్తింపునకు గ్రామ సభలు
గ్రామసభల ద్వారా 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి పనులు గుర్తించేందుకు ప్రణాళికలు రూపొందించాం. పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి అందరి ఆమోదంతో పనులను గుర్తిస్తారు. –వి.వి అప్పారావు, డీఆర్డీఓ
నాగారం : జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పని కల్పించడానికి ఉద్దేశించిన గ్రామసభలు జిల్లాలో ఈ నెలలో ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి అక్టోబరు 2వ తేదీ నుంచే వీటిని చేపట్టాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి దృష్ట్యా కొత్త పనులను గుర్తించలేదు. ప్రస్తుతం కోడ్ తొలగిపోవడంతో జిల్లాలో ఈ నెలలో గ్రామసభల ద్వారా 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి పనులు గుర్తించనున్నారు.
58 రకాల పనులు
నిబంధనల ప్రకారం పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి అందరి ఆమోదంతో పనులను గుర్తించాలి. జిల్లా వ్యాప్తంగా 486 గ్రామ పంచాయతీలు ఉండగా అన్నింటా గ్రామసభలు నిర్వహించడానికి ఇది వరకే ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ మేరకు 58 రకాల పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందిస్తున్నారు. వీలైనంత త్వరగా గ్రామసభలు పూర్తిచేసి మండల పరిషత్‌కు, ఆ తర్వాత జిల్లాకు పంపించి అనుమతులు తీసుకోవాలని అధికారులు తలపోస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ఏడాదికి సంబంధించిన పనులు కొనసాగుతాయి. ఆ తర్వాత ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్తగా గుర్తించిన పనులు ప్రారంభిస్తారు.
సీజన్లకు అనుగుణంగా..
గ్రామసభల్లో సీజన్లకు అనుగుణంగా ఉపాధి పనులు గుర్తిస్తారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ ఏడాది కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో కూలీల సహాయాన్ని తీసుకోనున్నారు. అలాగే పంట పొలాల్లో కూలీలతో ఇసుక మేటలు తొలగించనున్నారు. వ్యవసాయ పనులు మెండుగా ఉండే రోజుల్లో కూలీలు తక్కువ సంఖ్యలో హాజరవుతుంటారు. ఆ పనులు లేని సమయంలో అధిక మందికి పనులు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తుంటారు. జిల్లాలో కొన్నాళ్లుగా ఎక్కువగా భూగర్భజలాల పెంపునకు సంబంధించిన పనులకే ప్రాధాన్యమిస్తున్నారు. చెరువులు, కాలువలు, కుంటల్లో పూడికతీత, కాలువల్లో పిచ్చిమొక్కలు, పొదల తొలగింపు, నీటి కుంటల నిర్మాణం, కందకాల తవ్వకం, అంతర్గత మట్టి రోడ్ల నిర్మాణం, మొక్కలు, పండ్ల తోటల పెంపకం వంటి పనులు ఎక్కువగా చేస్తున్నారు.
ఫ త్వరలో నిర్వహించేలా కార్యాచరణ
ఫ 58 రకాల ఉపాధి పనులు చేపట్టాలని నిర్ణయం
ఫ ఈ సారి కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ఇసుక మేటల తొలగింపు
గ్రామ పంచాయతీలు 486
మండలాలు 23
నమోదైన కూలీల సంఖ్య 1.34 లక్షలు
జాబ్ కార్డులు 2.63లక్షలు

పనుల గుర్తింపునకు గ్రామ సభలు