
అర్జీలు వెంటనే పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చే అర్జీలను జిల్లా అధికారులు వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కె.సీతారామారావు ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి మాట్లాడారు. జిల్లా అధికారులు పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ వి.వి.అప్పారావు, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్, డీసీఓ పద్మ, డీఈఓ అశోక్, డీఏఓ శ్రీధర్ రెడ్డి, సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్, శ్రీనివాస్, నరసింహారావు , పరిపాలన అధికారి సుదర్శన్‌రెడ్డి, సూపరింటెండెంట్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
55 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం
వానా కాలం 2025–26 సీజన్‌కు సంబంధించి సూర్యాపేట జిల్లాలో 55 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు అదనపు కలెక్టర్ కె.సీతారామారావు తెలిపారు. వానాకాలం ధాన్యం సేకరణపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర సివిల్ సప్లయ్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్టీఫెన్ రవీంద్ర .. జిల్లా అదనపు కలెక్టర్, సివిల్ సప్లయ్, వ్యవసాయ, మార్కెటింగ్, కో–ఆపరేటివ్, ట్రాన్స్‌ఫోర్ట్ అధికారులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూర్యాపేట కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. ప్రస్తుతానికి జిల్లాలో 298 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపామన్నారు. 4లక్షల 30 వేల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అదనపు కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రతి సెంటర్‌లో సెంటర్ పేరు, సెంటర్ ఇన్‌చార్జి పేరు, ఇతర సిబ్బంది పేర్లు ఉండాలన్నారు. ప్రతి మండలంలో మండల్ స్పెషల్ ఆఫీసర్‌గా జిల్లా అధికారులను నియమించాలని, ఎంపీడీఓలకు ఐకేపీ సెంటర్ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాలని, ప్రతి సెంటర్‌లో ఎక్విప్మెంట్ లెక్కలు కచ్చితంగా ఉండాలన్నారు. అవసరమైన సామగ్రికి ఇండెంట్ పెట్టాలని, ధాన్యం కొనుగోలులో అక్రమాలు, అలసత్వం ప్రదర్శిస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డీఎస్‌ఓ మోహన్ బాబు, సివిల్ సప్లయ్ డీఎం రాము, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి వి.వి. అప్పారావు, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ, డీసీఓ పద్మ, డీఏఓ శ్రీధర్ రెడ్డి, ఏపీడీ సురేష్, నగేష్, ఏడీఎం బెనర్జీ, ఏఎస్‌ఓ శ్రీనివాస్ రెడ్డి, ట్రాన్స్‌పోర్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ సీతారామారావు