
అందరి ఆమోదంతోనే డీసీసీ అధ్యక్షుడి ఎంపిక
భానుపురి (సూర్యాపేట) : పార్టీ శ్రేణుల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడి నియామకం ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు సారత్ రౌత్ తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏఐసీసీ నాయకుడు రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేస్తామన్నారు. మొదటగా గుజరాత్‌లో పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయం సేకరించి డీసీసీ అధ్యక్షుల ఎంపిక చేసినట్టు ఆయన చెప్పారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ, ప్రస్తుతం తెలంగాణలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం జిల్లావ్యాప్తంగా మండలాలు, గ్రామాలలో తాను పర్యటిస్తానని, అందరి అభిప్రాయాలు తెలుసుకుని డీసీసీ అధ్యక్షుని ఎంపికలో యువతకు ప్రాధాన్యమిస్తామన్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుంచి ఆరుగురు పేర్లు ఏఐసీసీకి పంపిస్తామని, వారిలో ఒకరిని డీసీసీ అధ్యక్షుడిగా ఏఐసీసీ ఎంపిక చేస్తుందన్నారు. నాయకులు, కార్యకర్తలతో పాటు పౌర సమాజం, ఎన్జీఓలను కలుస్తానని, ఎవరైనా తమ అభిప్రాయం తెలియజేయవచ్చన్నారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయం ప్రకారం ఉత్తమమైన వ్యక్తులను తాను సెలెక్ట్ చేయనున్నట్లు తెలిపారు. లాభాపేక్ష లేకుండా పార్టీకి పనిచేసే వారిని ఎంపిక చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున పార్టీ కూడా పటిష్టం అయ్యేలా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, పీసీసీ జనరల్ సెక్రటరీ చకిలం రాజేశ్వరరావు, ఓబీసీ నాయకులు తండు శ్రీనివాస్ యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మార్కెట్ చైర్మన్లు అరుణ్ కుమార్, నరేష్ సుమతి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అనురాధ, పట్టణ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలీ, మండల పార్టీ అధ్యక్షులు వీరన్న నాయక్, తూముల సురేష్ రావు, కోతి గోపాల్ రెడ్డి, కందాల వెంకట్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేములపల్లి వాసుదేవ రావు, దండి రమేష్, జిల్లా వాణిజ్య సెల్ అధ్యక్షుడు కక్కిరెని శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అభినయ్, కోదాడ,హుజూర్‌నగర్ మండల, బ్లాక్ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఏఐసీసీ పరిశీలకుడు సారత్ రౌత్

అందరి ఆమోదంతోనే డీసీసీ అధ్యక్షుడి ఎంపిక