
అసైన్డ్ భూముల సాగుకు యత్నం
నూతనకల్ : కొందరు అక్రమార్కులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అడ్డదారుల్లో అసైన్డ్ భూముల సాగుకు పూనుకున్నారు. ఈ క్రమంలో సాగుకు యోగ్యంకాని భూములను భారీ యంత్రాలను ఉపయోగించి చదును చేస్తున్నారు. ఈ వ్యవహారం నూతనకల్ మండలంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. నూతనకల్ మండలం యడవెల్లి గ్రామ శివారులో 87 సర్వే నంబర్‌లో దేశ్‌ముఖ్ జెన్నారెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి పేరు మీద పట్టా కలిగిన 18ఎకరాల పైచిలుకు భూమిని గ్రామంలోని గొర్రెల మేతకోసం యాదవులకు శ్యాంసుందర్‌రెడ్డి ఉచితంగా ఇచ్చారు. ఈ భూమి అసైన్డ్ భూమి జాబితాలో చేరింది. ఈ భూమిపై రాజకీయ నాయకులు, రియల్ ఏస్టేట్ వ్యాపారుల కన్నుపడింది. దీంతో గొర్రెలకాపరులకు పెద్ద మొత్తంలో నగదు ఆశ చూపి భూములను కొనుగోలు చేశారు. అయితే అసైన్డ్ భూముల వివరాల నివేదిక అందించాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశించడంతో సర్వే నిర్వహిస్తున్నారు.
సాగుకు యోగ్యంగా మార్చేందుకు..
87 సర్వే నంబర్‌లో సాగుకు యోగ్యంకాని భూములను సర్వే చేయబోమని అధికారులు తెల్పడంతో యాదవ కులస్తుల నుంచి భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి జేసీబీలను ఏర్పాటు చేసి సాగుకు యోగ్యమైన భూమిగా మార్చడం కోసం పదుల సంఖ్యలో భారీ యంత్రాలను ఉపయోగించి పచ్చని చెట్లు, రాతి బండలను తొలగిస్తున్నాడు. దీంతో అక్కడ నివసించే నెమళ్లు, అడవి పందులు, వివిధ పక్షుల జాతులకు నిలువనీడ లేకుండా పోయింది. అధికారులు స్పందించి సాగుకు యోగ్యంకాని భూమిలో చేపడుతున్న భూ అభివృద్ధి పనులను వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
నిబంధనలు ఉల్లఘిస్తే చర్యలు : తహసీల్దార్
ఈ విషయమై నూతనకల్ తహసీల్దార్ శ్రీనివాసరావును వివరణకోరగా సీలింగ్ యాక్ట్ ప్రకారం సాగుకు యోగ్యంకాని భూములు సర్వేచేయ బోమని, సాగు భూములనే సర్వేచేసి నిర్ధారిస్తామని తెలిపారు. అసైన్డ్ భూముల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
ఫ నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు
ఫ జేసీబీలతో చదును చేస్తున్న అక్రమార్కులు
ఫ అడ్డుకోవాలంటున్న యడవెల్లి గ్రామస్తులు