
సరైన వసతుల్లేని శిల్ప కళాశాల
ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీలక్ష్మీనరసింహ శిల్ప కళాశాలలో అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా గదులు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో శిల్ప కళాశాలలో విద్యార్థులు కూర్చునే గది పైకప్పు నుంచి నీరు లీకవ్వడంతో భయాందోళనకు గురయ్యారు. శిల్ప కళాశాల నిర్వహిస్తున్న భవనంలోనే శ్రీలక్ష్మీనరసింహస్వామి సంస్కృత విద్యాపీఠంను కూడా కొనసాగిస్తున్నారు.
తెలంగాణలోనే మొదటిది..
తెలంగాణలోనే మొదటి శిల్ప కళాశాలను 2019లో యాదగిరిగుట్ట పట్టణంలో స్థాపించి, సర్టిఫికెట్ కోర్సులు మొదలుపెట్టారు. 2022–23 విద్యా సంవత్సరంలో భాగంగా జవహర్‌లాల్ నెహ్రూ ఆర్చిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ), హైదరాబాద్ అనుబంధంతో 3 సంవత్సరాల బీఏ కోర్సును ప్రారంభించారు. గతంలో శిల్ప కళను నేర్చుకునేందుకు రాష్ట్రంలోని పలువురు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలో ఏర్పాటు చేసిన శిల్ప కళాశాలకు వెళ్లేవారు. అయితే సంప్రదాయ దేవాలయ శిల్ప కళాభివృద్ధిలో భాగంగా గత ప్రభుత్వం, వైటీడీఏ ఆలోచనతో శ్రీలక్ష్మీనరసింహ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్చర్ అండ్ ఆర్చిటెక్చర్ పేరుతో యాదగిరిగుట్టలో శిల్ప కళాశాలను ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం 28 మంది విద్యార్ధులు..
ఈ శిల్ప కళాశాలలో ప్రస్తుతం 28 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 28 మంది విద్యార్థులకు గాను ఆరు గదులు ఉండాలి. కానీ ఇక్కడ మూడు గదులు మాత్రమే ఉండగా.. ఇందులో ఒక గదిని ఆఫీస్ రూమ్ కోసం, మరో రెండింటిని విద్యార్థులకు కేటాయించారు. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో ఒక గది పైకప్పు నుంచి వర్షం నీరు లీకేజీ అవుతున్నాయి. దీంతో నిర్వాహకులు ఆ గదిని ఖాళీ చేసి, విద్యార్థులందరినీ ఒకే గదిలోకి పంపించారు. దీంతో అందులోనే విద్యనభ్యసించడంతో పాటు ప్రాక్టికల్స్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మూడు సెమిస్టర్లు ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. యాదగిరీశుడి ప్రధానాలయ పునఃనిర్మాణంలో స్తపతులుగా పనిచేసిన నలుగురు శిల్ప కళాశాలలో అధ్యాపకులుగా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్నారు. శిల్ప కళాశాలకు రాబోయే రోజుల్లో విద్యార్థుల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో విశాలంగా ఉండేందుకు 2 ఎకరాల స్థలంతో పాటు రెగ్యులర్ అధ్యాపకులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
సంస్కృత విద్యాపీఠం ఇదే భవనంలో..
శిల్ప కళాశాల నడుస్తున్న భవనంలోని మొదటి అంతస్తులో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం అనుబంధంతో శ్రీలక్ష్మీనరసింహస్వామి సంస్కృత విద్యాపీఠాన్ని నడిపిస్తున్నారు. ఈ విద్యాపీఠంలో సుమారు 68మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పై అంతస్తులోనే విద్యార్థులు చదువుకోవడంతో పాటు అక్కడే మూత్రశాలలు ఏర్పాటు చేశారు. ఇందులో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కొనసాగుతుంది. ఈ సంస్కృత విద్యాపీఠం విద్యార్థులకు సైతం సరిపడా గదులు లేకపోవడం గమనార్హం. కాగా.. యాదగిరిగుట్ట పట్టణానికి సెంటర్‌గా ఉన్న ఈ భవనాన్ని 2005లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కొనసాగించేందుకు అదనపు గదులను నిర్మించారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత గోశాల సమీపంలో కొనసాగుతుండగా.. ఐదేళ్ల క్రితం సంస్కృత విద్యాపీఠం, శిల్ప కళాశాలను కొనసాగించేందుకు దేవస్థానం, వైటీడీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఫ వర్షానికి కురుస్తున్న పైకప్పు
ఫ అదే కళాశాలలో కొనసాగుతున్న
సంస్కృత విద్యాపీఠం
ఫ ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
ఫ నూతన భవనంలోకి
మార్చాలని డిమాండ్
యాదగిరిగుట్టలో 2019లో శిల్ప కళాశాలను సర్టిఫికెట్ కోర్సుగా ప్రారంభించాం. అనంతరం వైటీడీఏ, దేవస్థానం, అప్పటి ప్రభుత్వ పెద్దలు 2022–23లో జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, హైదరాబాద్ అనుబంధంతో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో 28 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఒక గది పైకప్పు నుంచి నీరు లీకేజీ అవుతుంది. దీంతో విద్యార్థులను మరో గదిలోకి మార్చాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మరో చోటుకు కళాశాలను మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.
– మోతీలాల్, శిల్ప కళాశాల ప్రిన్సిపాల్

సరైన వసతుల్లేని శిల్ప కళాశాల

సరైన వసతుల్లేని శిల్ప కళాశాల

సరైన వసతుల్లేని శిల్ప కళాశాల