
పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో తప్పు జరగలేదు
భానుపురి(సూర్యాపేట): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, మెరిట్ ప్రకారమే గ్రూప్–1 జాబితా తయారు చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవంలో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రతిభావంతుల మేధస్సును కించపరుస్తూ మానసికంగా దెబ్బతీయటానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఎక్కడా తప్పు జరగలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా వ్యవసాయ శాఖ ద్వారా సరఫరా చేస్తామని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, మంగళవారమే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రిని కలిసి యూరియాను ఎక్కువ మొత్తంలో సరఫరా చేయాలని కోరారని చెప్పారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని, గడిచిన 20 నెలలు సంక్షేమ పాలన అందించామని, అదేవిధంగా యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం రూ.600 కోట్లు మంజూరు చేసిందన్నారు.
ఫ మెరిట్ ప్రకారమే గ్రూప్–1 జాబితా
ఫ ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు