
సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న మతోన్మాదులు
ఫ సీపీఐ జిల్లా కార్యదర్శివెంకటేశ్వర్లు
సూర్యాపేట : దేశంలో కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్యత లోపించి ఉద్యమాలు చేపట్టకపోవడంతో భూమి, బుక్తి, విముక్తి కోసం జరిగిన రైతాంగ సాయుధ పోరాటాన్ని మతోన్మాదులు వక్రీవరిస్తూ రాజ్యమేలుతున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు ఆరోపించారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని ధర్మభిక్షం విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భూమి, భుక్తి, విముక్తి కోసం 4,000 మంది బలిదానాలతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగిందన్నారు. ఈ పోరాటం హిందూ ముస్లింల మధ్య జరిగిన ఘర్షణగా మతోన్మాద బీజేపీ ప్రచారం చేయడం దురదృష్టకరమని విమర్శించారు. ఈ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలిపేందుకు సీపీఐ ఆధ్వర్యంలో వారోత్సవాలను చేపట్టినట్లు తెలిపారు. ఈ సాయుధ పోరాటం కారణంగా 500 సంస్థానాలు విలీనం చేయడంతో పాటు పది లక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు పంచినట్లు గుర్తు చేశాన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ఎందుకు సంకోచిస్తుందో తెలియజేయాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో లేని బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ సహకారంతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా హైదరాబాద్‌లో కార్యక్రమాన్ని నిర్వహించడం సిగ్గుచేటు అని అన్నారు. కార్యక్రమంలో పార్టీ సూర్యాపేట పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యుడు యాదగిరి, పట్టణ కార్యవర్గ సభ్యులు బొమ్మగాని శ్రీనివాస్, రాంబాబు, అశోక్ కుమార్, నాయకులు అంతయ్య, బుర్ర శ్రీరాములు, రాము, రాజారాం, శ్రీకాంత్, శివరాం, ఇతర ప్రముఖులు డేగల జనార్దన్, నాతి సవేందర్, తల్లమల్ల హసేన్, కృష్ణ పాల్గొన్నారు.