
వర్షం 15% తక్కువే..
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో రైతన్నల ఆశలు ఇక ఆగస్టు మాసంపైనే ఆధారపడి ఉన్నాయి. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా సరైన వర్షాలు లేవు. ఈ సీజన్‌లో జిల్లాలో సరాసరి 15శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీని కారణంగా వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 2,65,332 ఎకరాల్లో సాగైన వివిధ పంటలు పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే ఈనెలలో కురిసే వానలపైనే ఆధారపడి ఉంది. సాధారణానికి మించి వర్షాలు కురవకపోతే బోరుబావులుసైతం వట్టిపోయే పరిస్థితి నెలకొంది.
అంచనాలు తలకిందులు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కారణంగా మంచి వర్షాలే ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో రైతాంగం సంబురపడగా.. ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవనేలేదు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అసలు వాగులు, వంకలు సాగిన దాఖలాలు సైతం లేవు. కేవలం మోస్తరు వర్షాలే.. అదీ నెలలో 7, 8 రోజులకు మించి పడలేదు. జిల్లా గణాంక శాఖ అధికారుల లెక్కల ప్రకారం.. జూన్‌లో 95.5 మి.మీలు కురవాల్సి ఉండగా 44 శాతం లోటుగా 53.2 మి.మీ వర్షపాతం కురిసింది. జూలై చివరి వారంలో నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలకు సాధారణం 162.7 మి.మీలకుగాను 2శాతం మించి 166.6 మి.మీల వర్షపాతం నమోదైంది. అయినా ఈ సీజన్ మొత్తంగా చూసుకుంటే జిల్లాలో సరాసరి 15 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
రైతుల్లో ఆందోళన
తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా రైతాంగం ఆందోళన చెందుతోంది. ఈనెలలో వర్షాలు కురిసి.. చెరువులు నిండితే సరి లేదంటే సాగైన పంటలు సైతం చేతికొచ్చుడు కష్టమేనన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి లోటు వర్షపాతం కారణంగా జిల్లాలో ఉన్న 1200 చెరువులు, కుంటలకు గాను కేవలం పది నుంచి 15 చెరువుల్లోకి మాత్రమే నీళ్లు వచ్చాయి. ఇక సాగర్, మూసీ ఆయకట్టు పరిధిలో ఉన్న చెరువుల్లోకి నీళ్లు వచ్చినా.. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలోని చెరువులు నీటి జాడకోసం ఎదురు చూస్తున్నాయి. ఇదే పరిస్థితి నెలకొంటే ఆయా ప్రాంతాల్లో బోరుబావులు వట్టిపోయి నీటి ఆధారిత పంట వరి సాగు ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ క్రమంలో జిల్లా రైతాంగం ఈనెలలో కురిసే వర్షాలపైనే గంపెడు ఆశలు పెట్టుకుంది.
బోర్లుపోయడం కష్టమే
వాతావరణం ఇలాగే ఉంటే బోర్లు పోయడం కష్టమే. చెరువులు, కుంటల్లోకి నీళ్లు వస్తేనే చివరి వరకు పొలాలు పారుతాయి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. రెండెకరాలు నాటు పెడుతున్నాం. చేతికొచ్చినప్పుడు లెక్క.
– గడ్డం కేశయ్య, రైతు
పంట అంచనా(ఎకరాల్లో..) సాగైంది(ఎకరాల్లో)
వరి 4,85,125 2,11,096
పత్తి 91,000 50,236
ఇతర పంటలు 5,000 4,000
ఈ రైతు పేరు బట్టిపెట్టి శ్రీను. సొంతూరు ఆత్మకూర్(ఎస్). ఏటా జూన్, జూలైలో కురిసే వర్షాలకు గ్రామంలోని మర్రికుంటలోకి నీరు వచ్చేది. దీని కిందనే ఉన్న ఎకరం పొలం నాటుపెట్టేవాడు. ఈ వానాకాలం ఏ మాత్రం నీళ్లు కుంటలోకి రాలేదు. ఎకరం పొలం అలాగే ఉంది. వారం, పదిరోజుల్లో నీళ్లు రాకుంటే ఈ సారి వరి
సాగుబంద్ చేయడమే.
ఫ వానాకాలంలో ఇప్పటి వరకు
లోటు వర్షపాతమే నమోదు
ఫ ఈ నెలపైనే రైతుల ఆశలు
ఫ 2,65,332 ఎకరాల్లో వివిధ
పంటలు సాగు
ఫ వరుణుడు కరుణించకపోతే సాగైన పంటలు చేతికి అందడం కష్టమే

వర్షం 15% తక్కువే..

వర్షం 15% తక్కువే..