ఆత్మకూర్ (ఎస్): ఇళ్లలో వాడుకున్న నీటితోపాటు వాననీరు బయటికి వృథాగా పోకుండా భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరిగేలా చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణ లక్ష్యం నెరవేరలేదు. జూలై 20వరకు యుద్ధప్రాతిపదికన ఇంకుడు గుంతల నిర్మాణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ నెలరోజుల క్రితం డెడ్‌లైన్ విధించినా ప్రక్రియ పూర్తికానేలేదు. ఇప్పటి వరకు 58.40శాతం మాత్రమే పూర్తయ్యాయి.
23 గ్రామాల్లో నాలుగు విభాగాల్లో..
భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యంగా అధికారులు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో మండలానికి ఒక గ్రామం చొప్పున అధికారులు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో నాలుగు విభాగాల్లో 1,041 ఇంకుడు గుంతల నిర్మాణానికి కలెక్టర్ అనుమతులు ఇచ్చారు. ఇందులో మొదటి విభాగం కింద ఇళ్లలో వ్యక్తిగతంగా 925, రెండో విభాగం కింద గ్రామ కూడళ్లు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద కమ్యూనిటీ ఇంకుడు గుంతలు 64, మూడో విభాగం కింద మురుగు కాలువలు ముగిసే ప్రాంతాల్లో (డ్రెయిన్ ఎండ్) 10, నాలుగో విభాగం కింద బోరుబావుల రీచార్జ్ కోసం గ్రామపంచాయతీ, ప్రైవేటు బోర్ల వద్ద 42 ఇంకుడు గుంతలు మంజూరయ్యాయి.
సబ్సిడీ.. దేనికెంత..
ఇంకుడు గుంతల నిర్మాణాలకు ప్రభుత్వం సబ్సిడీ కూడా ప్రకటించింది. వీటిలో వ్యక్తిగత గుంతలకు ఒక్కోదానికి రూ.6వేలు, కమ్యూనిటీ వాటికి రూ.13వేలు, బోర్ వెల్ రీచార్జ్ గుంతలకు రూ.40వేలు, డ్రెయిన్ ఎండ్‌లో నిర్మించేవాటికి రూ.92వేల చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుంది. వీటితో పాటు ప్రతి గ్రామానికి కలెక్టర్ ప్రత్యేకంగా రూ.2లక్షల చొప్పున మంజూరు చేశారు.
608 ఇంకుడు గుంతలు పూర్తి
జిల్లాకు అన్ని రకాల ఇంకుడుగుంతలు కలిపి జిల్లాకు 1,041 మంజూరయ్యాయి. కాగా వీటిని ఈనెల 20తేదీ వరకు పూర్తి చేయాలని ఎంపీడీఓల సమావేశంలో కలెక్టర్ గడువు విధించారు. కానీ ఈప్రక్రియ నత్తనడకన నడుస్తోంది. నిర్దేశించిన గడువులోగా కేవలం 608 ఇంకుడుగుంతలు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 433 ఇంకుడు గుంతల పూర్తికావాల్సి ఉంది.
ప్రయోజనాలు..
ఇంకుడు గుంతల నిర్మాణంతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడడంతో పాటు మురుగునీటి సమస్య పరిష్కారం అవుతుంది.
డ్రెయినేజీలలో నీరు నిల్వ ఉండదు. కాబదోమలు రావు.
వర్షపు నీరు, ఇళ్లలో నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయి.
లక్ష్యం చేరని ఇంకుడు గుంతల నిర్మాణం
‘స్వచ్ఛభారత్’ కింద పైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక
1,041 ఇంకుడు గుంతలు మంజూరు
20వ తేదీతో ముగిసిన డెడ్‌లైన్
ఇప్పటి వరకు 58.40శాతమే పూర్తి
ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి
ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు పాత సూర్యాపేట గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపడుతున్నాం. ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించుకొని భూగర్భ జలాల పెంపునకు కృషిచేయాలి.
– ఎం.డి.హాసిం, ఎంపీడీఓ, ఆత్మకూర్(ఎస్)
ఇంకుడు గుంత.. ఇంతే.!