
హాస్టళ్లలో కమిటీలు ఏర్పాటు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : సంక్షేమ వసతి గృహాల్లో ఫుడ్ సేఫ్టీ, ఆహార నాణ్యత, శానిటేషన్‌పై కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎస్ రామకృష్ణారావు, ఇతర కార్యదర్శులతో కలిసి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో సూర్యాపేట కలెక్టరేట్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లా అధికారులు నెలకోసారి హాస్టళ్లలో నిద్రించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్నారు. హాస్టళ్లలో ప్రతి విద్యార్థి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని సూచించారు. హాస్టల్ ఆవరణలోకి పాములు రాకుండా గడ్డిని శుభ్రం చేయాలన్నారు. లైసెన్స్ సర్వేయర్లు, గ్రామ పాలనాధికారులకు ఈనెల 27న నిర్వహించే పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పనులు వేగవంతం చేయాలన్నారు. వీటి నిర్మాణానికి ఇసుక ఉచితంగా ఇవ్వాలన్నారు. లబ్ధిదారుల అకౌంట్, ఆధార్‌లలో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సరి చేసి వారికి నగదు జమ చేయాలన్నారు. వనమహోత్సవంలో శాఖల వారీగా మొక్కలు నాటాలని, పాఠశాలలు, దేవాలయాలు, సంక్షేమ హాస్టళ్లను గుర్తించి గుంతలు తీయాలన్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రతి మిల్లును తనిఖీ చేసి సీఎంఆర్‌ను వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఎఫ్‌ఓ సతీష్ కుమార్, డీఈఓ అశోక్, డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, పరిశ్రమలశాఖ జిల్లా అధికారి సీతారాంనాయక్, డీఎస్‌ఓ మోహన్ బాబు, సంక్షేమ అధికారులు శంకర్, శ్రీనివాస్‌నాయక్, జగదీశ్వర్ రెడ్డి, లత, డీసీఓలు, ఆర్‌సీఓలు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్