
దళితులపై పెరుగుతున్న దౌర్జన్యాలు
సూర్యాపేట అర్బన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మనువాద విధానాలతో దేశంలో దళితులపై దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని దళిత్ శోషణ్ ముక్తి మంచ్ (డీఎస్‌ఎంఎం) జాతీయ కార్యదర్శి బీవీ రాఘవులు ఆరోపించారు. మంగళవారం సూర్యాపేటలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్రస్థాయి సామాజిక శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జెండాను సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు ఆవిష్కరించారు. అనంతరం బీవీ రాఘవులు మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల కంటే రెట్టింపు స్థాయిలో ఉత్తరాది రాష్ట్రాల్లో దళితులపై దౌర్జన్యాలు పెట్రేగిపోతున్నాయని అన్నారు. అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని అంగీకరించని మనువాద పాలకులు దేశాన్ని ఏలుతున్నారన్నారు. మనువాద ధర్మం, సనాతన ధర్మం ఎడమ చేయి, కుడి చేయి లాంటిదన్నారు. భూమి, రిజర్వేషన్లు, ప్రకృతి వనరులు అట్టడుగు వర్గాలకు దక్కకుండా కేవలం కుల సమస్య విడిగా పరిష్కారం కాదన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదని, అట్టడుగు వర్గాలకు జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు లేవని అన్నారు. అన్ని రకాల వివక్షలను అంతమొందించడానికి సమాజంలో దోపిడీని ఎదిరించే శక్తులతో కలిసి సామాజిక న్యాయం కోసం ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. బిహార్ రాష్ట్రంలో మైనార్టీల ఓట్ల తొలగింపు పౌర ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ అబ్బాస్, తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు.
ఫ దళిత్ శోషణ్ ముక్తి మంచ్ జాతీయ కార్యదర్శి బీవీ రాఘవులు
ఫ సూర్యాపేటలో కేవీపీఎస్ రాష్ట్రస్థాయి సామాజిక శిక్షణ తరగతులు ప్రారంభం