
మధ్యవర్తిత్వంతో సమస్యలు పరిష్కరించుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : చిన్న చిన్న ఘర్షణలకు కోర్టు మెట్లు ఎక్కకుండా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. లక్ష్మీ శారద సూచించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో 90రోజుల ప్రచారం–దేశం కోసం మధ్యవర్తిత్వం అనే అంశంపై న్యాయవాదులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. కోర్టుకు వెళ్లకుండా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకుంటే ఇరువర్గాలకు సమయం, ధనం వృథాకాకుండా ఉంటుందన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా వినియోగదారుల వివాదాలు, డబ్బు, ఆస్తి, సమాజ సంఘర్షణలు, వాణిజ్య, వైవాహిక, వినియోగదారుల వివాదాలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి
సూర్యాపేట : ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలని అదనపు కలెక్టర్ పర్స రాంబాబు సూచించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం సూర్యాపేట పట్టణ పరిధిలోని కుడ కుడలో గంగదేవమ్మ గుడి ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సీహెచ్.హన్మంతరెడ్డి, మున్సిపల్ డీఈ సత్యారావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది యాదగిరి, వార్డ్ అధికారి రమేష్ వసుంధర, వసీం పాల్గొన్నారు.
25న ఉద్యోగమేళా
భానుపురి (సూర్యాపేట) : ఇంటర్ విద్యార్థులకు కలెక్టర్, హెచ్‌సీఎల్ టెక్‌బీ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం హెచ్‌సీఎల్ ప్రతినిధి ఫోన్ నంబర్లు 8341405102, 7981834205, 9063564875లను సంప్రదించాలని సూచించారు.
ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి
తిరుమలగిరి ( తుంగతుర్తి ): ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్‌కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం తిరుమలగిరి మండల కేంద్రంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు కొత్తగట్టు మల్లయ్య, సీపీఐ జిల్లా నాయకుడు ఎల్లంల యాదగిరిలతో కలిసి డేవిడ్‌కుమార్ మాట్లాడారు. ఎస్సారెస్పీ రెండో దశ కింద సూర్యాపేట జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా నీళ్లు ఇవ్వాలన్నారు. రుద్రమ చెరువును రిజర్వాయర్ గా చేయాలని డిమాండ్ చేశారు. కాల్వలకు మరమ్మతులు చేపట్టి చెరువులు, కుంటలు నింపాలన్నారు. రైతులు నార్లు పోసుకొని నాటు పెట్టడానికి సిద్ధంగా ఉన్న సమయంలో వర్షాలు రాక ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి తరుణంలో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీటిని విడుదల ఆదుకోవాలని కోరారు. సమావేశంలో బొడ్డు శంకర్, కందుకూరి ప్రవీణ్, పోలేబోయిన కిరణ్, కె.సోమేశ్, బచ్చు విజయ్, సుధాకర్ పాల్గొన్నారు.

మధ్యవర్తిత్వంతో సమస్యలు పరిష్కరించుకోవాలి

మధ్యవర్తిత్వంతో సమస్యలు పరిష్కరించుకోవాలి