
కొత్త ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ
అర్వపల్లి: కొత్త ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని అదనపు కలెక్టర్ రాంబాబు పేర్కొన్నారు. కొత్త ఓటర్ల నమోదు, ఎన్నికల ప్రక్రియ, రిజిస్టర్‌ల నిర్వహణ, ఫారం 6,7,8 తదితర అంశాలపై మంగళవారం జాజిరెడ్డిగూడెం మండలంలోని బీఎల్‌ఓలకు స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణకు అదనపు కలెక్టర్ హాజరై బీఎల్‌ఓలకు తగు సూచనలు, సలహాలు ఇచ్చి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా బీఎల్‌ఓలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్, సూపర్‌వైజర్లు జలేందర్‌రావు, వెంకట్‌రెడ్డి, ప్రసన్న, మాస్టర్ ట్రైనర్లు భాస్కర్, గోపయ్య, బీఎల్‌ఓలు, సిబ్బంది పాల్గొన్నారు.
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
సూర్యాపేట అర్బన్ : ప్రధాని మోదీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. శ్రమశక్తిని దోపిడీ చేసి కార్పొరేట్ కంపెనీలకు అధికలాభాలు కట్టబెట్టేలా నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. సమ్మెలో కార్మికులంతా పాల్గొనాలని కోరారు.
మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం చేశారు. నూతన పట్టు వస్త్రాలంకరణ చేసి ఎదుర్కోళ్ల మహోత్సవం చేపట్టారు. అనంతరం విష్వక్సేనారాధన , పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. అంతేగాక శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అదేవిధంగా క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయస్వామికి నాగవల్లి దళాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్ కుమార్, అర్చకులు రామాచార్యులు , పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.