
కంది వైపు సాగుదాం!
సూర్యాపేట : జిల్లాలో ఏటా కంది సాగు క్రమంగా తగ్గుతూ వస్తోంది. కనీసం వెయ్యి ఎకరాలు కూడా రైతులు ఈ పంటను సాగు చేయడం లేదు. ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉండడంతో దిగుబడి తగ్గిపోతోంది. ఈ క్రమంలో పప్పు దినుసుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో కంది సాగు పెంచేలా కార్యాచరణ రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆసక్తి ఉన్న రైతులకు ఉచితంగా కంది విత్తనాలను పంపిణీ చేశారు. ఈ విత్తనాలతో కంది సాగు పెరిగి దిగుబడి రావడమే కాకుండా రైతులకు ఆదాయం రానుంది.
ఒక్కో కిట్‌లో నాలుగు
కిలోల చొప్పున విత్తనాలు
ఈ ఏడాది జిల్లాకు 900 కిట్ల కంది విత్తనాలను ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో కిట్ (సంచి)లో 4 కిలోల కంది విత్తనాలు ఉంటాయి. ఈ నాలుగు కిలోల సంచి దాదాపు రెండెకరాల విస్తీర్ణంలో సాగు చేసుకునే వీలుంటుంది. ఈ లెక్కన జిల్లాలో ఉచితంగా రైతులకు అందించిన కంది విత్తనాలతో 1,800 ఎకరాల్లో సాగు కానుంది. ఇప్పటికే ఈ కంది విత్తనాల పంపిణీ జిల్లావ్యాప్తంగా పూర్తి కావొచ్చింది. ఈ వానాకాలం కంది సాగు అంచనా 2,650 ఎకరాలుగా ఉంది. ఏటా 6వేల నుంచి 8వేల ఎకరాల వరకు రైతులతో సాగు చేయించాలని అధికారులు భావిస్తున్నారు. అయినా 100 ఎకరాలకు మించి సాగు కావడం లేదు. ఈ నేపథ్యంలో ఉచితంగా ప్రభుత్వం అందించిన విత్తనాలతోనైనా సాగు పెరగనుంది.
సాగు చేస్తే రైతులకు మేలు
రెండేళ్లుగా జిల్లాలో కంది పంటకు మంచి ధర పలుకుతోంది. కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.7,550 మద్దతు ధర చెల్లిస్తుండగా బహిరంగ మార్కెట్‌లోనూ దాదాపు రూ.8500 వరకు ధర పలికిన సందర్భాలు ఉన్నాయి. ఇతర పంటలతో పోల్చితే పెట్టుబడులు తక్కువగా ఉండి రైతులకు మంచి ధరతో మేలు జరుగుతుంది.
ఫ కంది పంట విస్తీర్ణం పెంచేలా ప్రత్యేక ప్రణాళిక
ఫ ఉచితంగా విత్తనాల పంపిణీ
ఫ ఆసక్తిగల రైతులకు 900 కిట్లు అందజేత
ఫ క్లస్టర్ల వారీగా సమావేశాలతో రైతులకు అవగాహన
అవగాహన కల్పిస్తున్నాం
పదేళ్ల క్రితం జిల్లాలో కంది సాగు బాగా ఉండేది. రానురాను వరి సాగు వైపు రైతులు మళ్లారు. కంది సాగు పడిపోయింది. ఈ పంట సాగు పెంచేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. కందులకు మద్దతు ధర రూ.7550 వరకు ఉంది. అందువల్ల రైతులకు ఉచితంగా కంది విత్తనాలను అందించాం.
– శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి
సాగు అంచనా 2,650 ఎకరాలు
పంపిణీ చేసిన కిట్లతో
సాగయ్యే విస్తీర్ణం 1800 ఎకరాలు
కేంద్రం ప్రకటించిన
మద్దతు ధర క్వింటాకు.. రూ.7,550

కంది వైపు సాగుదాం!

కంది వైపు సాగుదాం!