
యూరియా ఎమ్మార్పీకి విక్రయిస్తాం
కోదాడ:
హోల్‌సేల్ డీలర్లు తమ వద్ద ఎక్కువ ధర తీసుకుంటున్నారని వారిపై నిరసనగా తాము యూరియా అమ్మొద్దని నిర్ణయించుకున్నామని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అధికారులు చెప్పిన విధంగా సోమవారం నుంచి యూరియా ఎమ్మార్పీకి అమ్ముతామని డీలర్లు తెలిపారు. ఆదివారం ‘ఎమ్మార్పీకి అమ్మలేం’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్‌రెడ్డి స్పందించారు. ఈమేరకు ఆదివారం సాయంత్రం కోదాడలోని వర్తక సంఘం కార్యాలయంలో కోదాడ, మునగాల ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు, వ్యవసాయశాఖ అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని, ఈ విషయంలో రైతులు అధైర్యపడొద్దన్నారు. డీలర్లు, దుకాణాదారులు యథావిధిగా యూరియా అమ్మకాలు చేస్తారని, అలా చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొందరు కావాలనే రైతులను తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం చేశారని దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సోమవారం నుంచి ఎమ్మార్పీకే యూరియా అందుబాటులో ఉంటుందని తెలిపారు. యూరియాను బ్లాక్ చేసినా, అధిక ధరకు అమ్మినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో స్థానిక వ్యవసాయశాఖ అధికారులతో పాటు పలువురు ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు తదితరులు పాల్గొన్నారు.
ఫర్టిలైజర్ దుకాణాల
యజమానులతో సమావేశమైన
జిల్లా వ్యవసాయశాఖాధికారి

యూరియా ఎమ్మార్పీకి విక్రయిస్తాం