
ముంపు ముప్పు లేకుండా..
సూర్యాపేట అర్బన్ : రానున్న వర్షాకాలంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునగకుండా మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో ఏటా వర్షాకాలంలో కొన్ని కాలనీలు ముంపునకు గురవుతూ ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడంతోపాటు భారీగా ఆస్తినష్టం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితి వచ్చే వర్షాకాలంలో పునరావృతం కాకుండా ఆయా ప్రాంతాల్లో నాలాలు, మురుగు కాలువల్లో పూడిక తీయిస్తున్నారు.
సమస్య ఎక్కడెక్కడంటే..
సూర్యాపేట పట్టణంలో మానస నగర్, తాళ్లగడ్డ, సైనిక్‌పురి కాలనీ, జీకే గార్డెన్, తిరుమలనగర్ కాలనీలు వర్షాకాలంలో వరదలకు ముంపునకు గురవుతుంటాయి. భారీగా వరదలు వచ్చి ప్రతీసారి నీట మునుగుతుంటాయి. రాకపోకలు కూడా నిలిచిపోతుంటాయి. ఇళ్లలోకి నీరు చేరి రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి. కాల్వల్లో సాఫీగా వరద పారేలా అధికారులు ముందస్తు పూడికతీత పనులు చేపట్టారు. ముఖ్యంగా సూర్యాపేటలోని ఎస్‌వీ ఇంజనీరింగ్ కాలేజీ వెనుక నుంచి నల్లచెరువు వరకు, కొత్త 100 ఫీట్ల రోడ్డు నుంచి పుల్లారెడ్డి చెరువు వరకు, సద్దల చెరువు నుంచి వయా మెడికల్ కాలేజీ మీదుగా త్రివేణి ఫంక్షన్ హాల్ వరకు జేసీబీల సాయంతో చుట్టుపక్కల కంపచెట్లు తొలగిస్తూ.. పూడిక తీయించారు. తాళ్లగడ్డ 60 ఫీట్ల రోడ్డు, కొత్త బస్టాండ్, సైనిక్‌పురి కాలనీలో మురుగు కాలువల్లోనూ పూడిక తీయించారు.
నిరంతర పర్యవేక్షణ
వరదలతో కాలనీలు నీట మునగకుండా ప్రత్యేక బృందాలు ఏర్పాటు నిరంతర పర్యవేక్షణ చేయను న్నట్లు అధికారులు చెబుతున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రత్యేకంగా జేసీబీలు ఏర్పాటు చేసి నీటిని మళ్లించనున్నారు. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు.