
సేవాదృక్పథంతో విధులు నిర్వహించాలి
భానుపురి (సూర్యాపేట) : లైసెన్స్‌డ్ సర్వేయర్లు సేవాదృక్పథంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి లైసెన్స్‌డ్ సర్వేయర్లు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న భూముల సర్వే నిజాం కాలం నాటిదని, ఆ సర్వే సహాయంతో లైసెన్స్‌డ్ సర్వేయర్లు అప్డేట్ చేసుకుంటూ కచ్చితమైన మ్యాప్ ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టం రూపొందించిందని, దీని అమలులో భాగంగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు భూముల మ్యాప్ పాస్‌బుక్‌లో ప్రింట్ ఇవ్వడానికి భూములను సర్వే చేసేందుకు సర్వేయర్ల నుంచి దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా స్వీకరించామన్నారు. జిల్లాలో మొదటి విడత కింద 235 మంది అభ్యర్థులకు మే 26 నుంచి జూలై 26 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
న్యాయబద్ధంగా పరిష్కరించాలి
అభ్యర్థులంతా భూసమస్యలను న్యాయబద్ధంగా పరిష్కరిస్తూ రైతులతో మంచిగా మెలగాలని కలెక్టర్ సూచించారు. భూములను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఎలాంటి గెట్టు తగాదాలు లేకుండా, హద్దులను కాపాడడంతోపాటు సర్వేయర్ల కొరత తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి స్కీం ప్రారంభించిందని తెలిపారు. 235 మందికి ట్రైనింగ్ ఇచ్చి, ఎగ్జామ్ పెట్టి పాసైన వారికి సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. అనంతరం సంబంధిత శిక్షణ కిట్టును అభ్యర్థులకు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఏడీ ఎస్‌ఎల్‌ఆర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, ప్రకాష్, సర్వేయర్లు శ్రీనివాస్, శ్యామ్, సమీర్, అలెన్ జోసెస్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్