
చికిత్స పొందుతూ మహిళ మృతి
తిప్పర్తి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. తిప్పర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి మండలం సర్వారం గ్రామానికి చెందిన రాచమల్ల మల్లమ్మ(60) ఈ నెల 14న తన కుమారుడు రాచమల్ల కోటిలింగంతో కలిసి సర్వారం నుంచి మామిడాల గ్రామానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. రోడ్డుపై గుంతలు ఉండటంతో మల్లమ్మ కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మృతురాలి కుమారుడు రాచమల్ల నాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమొదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
కారు ఢీకొని..
నకిరేకల్: నకిరేకల్ మండలం చందపట్ల గ్రామానికి చెందిన గాదె అర్జున్(26) బైక్‌పై ఈ నెల 3న నకిరేకల్‌కు వస్తుండగా.. పట్టణ శివారులోని ఎస్‌ఎఫ్ గార్డెన్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అర్జున్‌ను స్థానికులు నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులు నల్లగొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్ధితి విషమంగా ఉండటంతో ఈ నెల 14న హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. మృతుడు అవివాహితుడు. ఆదివారం మృతుడి సోదరుడు ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లచ్చిరెడ్డి తెలిపారు.