వైద్య ఆరోగ్యశాఖ ప్రక్షాళన! | - | Sakshi
Sakshi News home page

వైద్య ఆరోగ్యశాఖ ప్రక్షాళన!

May 18 2025 1:17 AM | Updated on May 18 2025 1:17 AM

వైద్య ఆరోగ్యశాఖ ప్రక్షాళన!

వైద్య ఆరోగ్యశాఖ ప్రక్షాళన!

అనుమతుల్లేని ఆసుపత్రుల్లో మెడికల్‌ కౌన్సిల్‌ బృందం తనిఖీలు

సూర్యాపేటటౌన్‌ : ప్రభుత్వం జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రక్షాళనకు పూనుకుంది. జిల్లా కేంద్రంలో పలు ప్రైవేట్‌ ఆసుపత్రులు అనుమతుల్లేకుండా కొనసాగుతున్నాయని, అర్హతలేని డాక్టర్లతో వైద్యసేవలు అందిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఇటీవల తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌, సూర్యాపేట ఐఎంఏ నిర్వహించిన సంయుక్త సూర్యాపేటలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టింది. దీంతో పలు వాస్తవాలు వెలుగు చూశాయి. అనుమతులు, అర్హతలు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్‌ ఆసుపత్రులపై వచ్చిన ఫిర్యాదులతో ఇటీవల తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ బృందం సభ్యులు జిల్లా కేంద్రంలో తనిఖీలు చేపట్టి ఏకంగా 55 ప్రైవేట్‌ ఆసుపత్రులు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో 17 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చి, రెండు స్కానింగ్‌ సెంటర్లను సీజ్‌ చేశారు.

మెడికల్‌ కౌన్సిల్‌ బృందం తనిఖీల్లో..

తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ బృందం తనిఖీల్లో సూర్యాపేటలోని శరత్‌ కార్డియాక్‌ సెంటర్‌లో డాక్టర్‌ లేకుండానే ఆపరేటరే నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. 13 ఏళ్లుగా అర్హతలు లేకుండా నకిలీ సర్టిఫికెట్‌తో చలామణి అవుతున్నట్టు తేలింది. దీంతోపాటు మరో ఆసుపత్రి సర్టిఫికెట్‌ వ్యాలిడిటీ పూర్తయ్యాక కూడా రెన్యువల్‌ చేసుకోనట్టు నిర్ధారించారు. ఈ దాడుల్లో ఏకంగా 55 ఆసుపత్రులను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు తేల్చారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌కు రిపోర్టు అందించగా చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. డీఎంహెచ్‌ఓ, ఐఎంఏ డాక్టర్లు, సూర్యాపేట ఆర్డీఓ నేతృత్వంలో మూడు బృందాలుగా ఏర్పడి క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌ మెంట్‌ యాక్ట్‌ ప్రకారం జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లలో తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో 17 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చి, రెండు స్కానింగ్‌ సెంటర్లను సీజ్‌ చేశారు. దీంట్లో భాగంగా శనివారం రాష్ట్ర వైద్య బృందం జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా అర్హత, అనుభవం లేకున్నా స్కానింగ్‌ సెంటర్‌లు, ఆస్పత్రులకు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై విచారణ చేఽశారు.

వెలుగులోకి పలు వాస్తవాలు

ఆర్డీఓ నేతృత్వంలోనూ ఐఎంఏ, ప్రత్యేక బృందాల ఆరా

ఇప్పటికే 55కిపైగా రిజిస్ట్రేషన్‌ లేని ఆసుపత్రుల గుర్తింపు

17 ఆసుపత్రులకు నోటీసులు,

రెండు స్కానింగ్‌ సెంటర్లు సీజ్‌

శనివారం డీఎంహెచ్‌ఓ ఆఫీస్‌లో

రాష్ట్ర వైద్య బృందం విచారణ

సంచలనంగా మారిన డీఎస్పీ, సీఐ ఏసీబీ ట్రాప్‌..

ఇటీవల అర్హతలు, అనుమతులు లేకుండా నడిపిస్తున్న యాపిల్‌ స్కానింగ్‌ సెంటర్‌, శ్రీసాయిగణేష్‌ మల్టీస్పెషాలిటీ, శ్రీకృష్ణ ఆసుపత్రులను తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యులు గుర్తించారు. వీటిపై సూర్యాపేట ఐఎంఏ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ మూడు ఆసుపత్రుల డాక్టర్లపై కేసు నమోదు చేశారు. ఇదే కేసులో యాపిల్‌ స్కానింగ్‌ సెంటర్‌ డాక్టర్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, పట్టణ సీఐ వీరరాఘవులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. రాష్ట్రంలో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రక్షాళనకు పూనుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement