
ముక్త్యాల బ్రాంచ్ కాల్వకు లైనింగ్
మునగాల: నాగార్జునసాగర్ ఎడమకాల్వకు అనుబంధంగా ఉన్న ముక్త్యాల బ్రాంచ్ కాల్వ లైనింగ్ పనులకు రూ.184.60కోట్ల వ్యయంతో ఆదివారం శ్రీకారం చుట్టారు. నీటి వృథాను అరికట్టడంతో పాటు చివరిభూములకు నీరు అందే విధంగా , నీటి ప్రవాహ వేగాన్ని పెంచడం, కాల్వ కట్టలను పటిష్టం చేసే పనులు చేపట్టనున్నారు.
45వేల ఎకరాలకుపైగా ఆయకట్టు
ముక్త్యాల బ్రాంచ్ కాల్వ మునగాల హెడ్ రెగ్యులేటర్ నుంచి ప్రారంభమై కోదాడ డివిజన్ పరిధిలో 16కిలో మీటర్లు, హుజూర్‌నగర్ డివిజన్ పరిధిలో 29కిలోమీటర్ల పొడవులో విస్తరించి ఉంది. దీని కింద సుమారు 45వేల ఎకరాల పైచిలుకు ఆయకట్టు ఉంది. ముక్త్యాల బ్రాంచ్ కాల్వపై తొమ్మిది అండర్ టన్నెల్స్, రెండు డబుల్‌లేన్ రోడ్డు బ్రిడ్జిలు ఉన్నాయి. కాగా కోదాడ డివిజన్ పరిధిలో మునగాల, చిలుకూరు మేజర్లు ఉండగా హుజూర్‌నగర్ డివిజన్ పరిధిలో చింత్రియాల, మఠంపల్లి, లింగగిరి, రాంపూర్, గుండ్లపల్లి మేజర్‌లు ఉన్నాయి.
చివరి భూములకు నీరు అందకపోవడంతో..
ముక్త్యాల బ్రాంచ్ కాల్వ ద్వారా చివరి భూములకు పూర్తిస్థాయిలో నీరు అందకపోవడంతో ఏటా సాగుచేసిన వందల ఎకరాలలో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో ముక్త్యాల బ్రాంచ్ కాల్వ కట్టలకు లైనింగ్ నిర్మిస్తే చివరిభూములకు పూర్తిస్థాయిలో నీరు అందే అవకాశం ఉందని నీరుపారుదలశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో కాల్వ లైనింగ్ పనులకు ఉపక్రమించారు. మునగాల మండలంలోని బరాఖత్‌గూడెం నుంచి లైనింగ్ పనులు ప్రారంభమయ్యాయి. సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణలో పలు యంత్రాలు లైనింగ్ పనిల్లో నిమగ్నమయ్యాయి. కాగా ఈ సారి కాల్వకు నీటిని విడుదల చేసే సమయానికి లైనింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఫ రూ.184.60కోట్లతో మునగాల హెడ్‌రెగ్యులేటర్ వద్ద పనులు ప్రారంభం
ఫ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ
ఫ కాల్వకు నీటిని విడుదల చేసే సమయానికి పూర్తిచేసేలా ప్రణాళిక
లైనింగ్ పనులు కొనసాగుతున్నాయి
ముక్త్యాల బ్రాంచ్ కాల్వ లైనింగ్ పనులు కొనసాగుతున్నాయి. బరాఖత్‌గూడెం వద్ద ప్రస్తుతం పనులు వేగవంతం చేశాం. వీలైనంత త్వరలో లైనింగ్ పనులను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం.
– ఉమ్మడి స్వప్న, డీఈ,
నీటిపారుదల శాఖ , కోదాడ డివిజన్