
చెరువుల్లో చేపల కొలనులు
కూలీలు, మత్స్యకారుల ఉపాధికి ప్రభుత్వ కార్యాచరణ
చిలుకూరు మండలంలో
ఏడు చెరువులు ఎంపిక చేశాం
చిలుకూరు మండలంలో చిలు కూరులో ఒకటి, బేతవోలులో 2, చెన్నారిగూడెంలో 2, ఆచార్యులగూడెంలో ఒకటి, నారాయణపురంలో ఒక చెరువుల్లో చేపల కొలనుల తవ్వకాలకు ఎంపిక చేశాం. ఏడు చెరువుల్లో చేపల కొలనుల తవ్వకాలకు ప్రతిపాదనలు పంపించాం. ఆయా చెరువుల శిఖంలో కొలనులు ఏర్పాటుకు కొలతలు తీసుకుంటున్నాం.
– నిర్మల, ఏపీఓ, చిలుకూరు
చిలుకూరు: గ్రామాల్లో కూలీలకు చేతినిండా పని కల్పిస్తూ.. చేపల పెంపకంతో మత్స్యకారులు ఉపాధి పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉపాధిహామీ పథకం కింద నిధులు కేటాయించి చెరువులు, కుంటల్లో చేపల కొలనులు తవ్వాలని నిర్ణయించింది. ఫలితంగా చెరువులు, కుంటల శిఖం భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడడంతోపాటు కూలీలు, మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.
కొలనుల తవ్వకాలకు ప్రణాళిక
చేపల కొలనుల నిర్మాణంలో భాగంగా జిల్లాలో అనువైన చెరువులు, కుంటల సమీపంలో శిఖం భూములు, నీటిని తరలించేందుకు వీలున్న ప్రాంతాలను అధికారులు గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ఏడాది 180 చెరువుల్లో కొలనుల పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతం ఎండలు మండిపోతుండడంతో చెరువుల్లో నీళ్లు ఉంటేనే గ్రామాల్లో నీటి సమస్య ఉండదనే ఉద్దేశంతో నీళ్లు వదలకుండా ఉంచుతున్నారు. వర్షాలు ప్రారంభమయ్యాయక చెరువుల్లోని నీళ్లు కొంత మేర వదిలి శిఖం భూములు తేలాక మరో నెలరోజుల తరువాత చెరువుల్లో చేపల కొలనుల తవ్వకాలు పనులు చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది.
మత్స్యకారులకు అదనపు ఆదాయం
చేపల కొలనులు నిర్మించడం ద్వారా చెరువుల్లో నీరునిల్వ ఉండడంతో భూగర్భ జలాలు పెరుగుతాయి. వర్షాభావ పరిస్థితుల్లో ఈ నీరు పంటలసాగుకు వాడుకోవచ్చు. కొలనుల తవ్వకంతో వెళ్లే మట్టిని పొలాలకు తోలుకోవడంతో భూసారం పెరుగుతుంది. చేపల పెంపకంతో మత్స్యకారులకు అదనపు ఆదాయం వస్తుంది. చెరువు శిఖం భూములు అన్యాక్రాంతం కాకుండా ఉంటాయి.
ఫ ఉపాధి పథకం కింద 180 చెరువుల్లో తవ్వకాలకు ప్రణాళిక
ఫ ప్రతిపాదనలు పంపిన యంత్రాంగం
ఫ ఒక్కో కొలనుకు రూ.8లక్షలు కేటాయింపు
ఫ ప్రతి క్యూబిక్ మీటర్‌కు రూ.291.45 కూలి చెల్లింపు
కొలనుల నిర్మాణం ఇలా..
చెరువులకు 100 నుంచి 300 మీటర్ల దూరంలో 25 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతులో ఈ చేపల కొలనులు తవ్వనున్నారు. ఒక్కో కొలను నిర్మాణానికి రూ.7లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. ఇందులో పనిచేసిన కూలీలకు ప్రతి క్యూబిక్ మీటర్‌కు రూ.291.45 చొప్పున కూలి చెల్లించనున్నారు. ప్రధాన చెరువుల్లోని నీటిని చేపల కొలనుల్లోకి రాకుండా నాలుగు వైపులా కట్టలు నిర్మించనున్నారు. కొలనుల నిర్మాణానికి 12 లక్షల పనిదినాలు కేటాయించారు. అయితే జిల్లాలో 2.63 లక్షల ఉపాధి జాబ్‌కార్డులు, 5,70,275 మంది కూలీలు ఉండగా వీరిలో 3,34,539 మంది పనులకు వెళ్తున్నారు. వీరందరికీ కొలనుల నిర్మాణంలో భాగంగా చేతినిండా పని లభించనుంది.

చెరువుల్లో చేపల కొలనులు

చెరువుల్లో చేపల కొలనులు