
త్వరలో గ్రామ పాలనాధికారులు
హుజూర్‌నగర్ : భూ సమస్యల సత్వర పరిష్కారానికి కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం జూన్ 2వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఇందుకోసం గ్రామ పాలనాధికారుల (జీపీఓల) నియామక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దీంట్లో భాగంగా అర్హత ఉన్న పూర్వ వీఆర్‌ఓలు, వీఆర్‌ఎలను జీపీఓలుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వీరినుంచి జిల్లా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుతం జిల్లాలో ఎంత మంది పూర్వ వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు ఉన్నారు. ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు.. జీపీఓ పోస్టుల్లో చేరేందుకు ఎంత మంది సుముఖంగా ఉన్నారనే వివరాలను అధికార యంత్రాంగం సేకరించింది.
దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి
ప్రభుత్వ నోటిఫికేషన్ మేరకు జీపీఓ పోస్టుకు ఆన్‌లైన్ విధానంలో 238 దరఖాస్తు చేసుకున్నారు. వీరి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కూడా ఇటీవల అధికారులు పూర్తి చేశారు. కొన్ని దరఖాస్తులను తిరస్కరించారు. అయితే గతంలో వీఆర్‌ఏలు, వీఆర్‌ఓలుగా పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వారిలో డిగ్రీ చేసిన వారికి, ఇంటర్‌తోపాటు ఐదేళ్ల సర్వీస్ ఉన్నవారికి అధికారులు ఆమోదముద్ర వేశారు.
ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓ
జిల్లాలో మొత్తం 486 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో 279 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓను నియమించనున్నారు. పూర్వ వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూ సమస్యలపై పట్టు ఉండడంతో వారినే జీపీఓలుగా తీసుకోనున్నారు.
విద్యార్హతలను సేకరించిన అధికారులు
గత ప్రభుత్వం 2022 ఆగస్టు 22న వీఆర్‌ఓ వ్యవస్థను రద్దు చేసి వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. పలువురు ఇతర జిల్లాల్లో పని చేస్తున్నారు. ఇతర శాఖలు, ప్రాంతాల్లో పనిచేస్తున్న పూర్వ వీఆర్‌ఓలను జిల్లాకు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం గ్రామ పాలనాధికారి పోస్టులకు ఇతర శాఖల్లో విధులు నిర్వహిస్తున్న వారికి అవకాశం కల్పిస్తోంది. దూర ప్రాంతాల్లోని వారు ఎంత మంది జీపీఓలుగా రావడానికి ఇష్టపడుతున్నారు, పూర్వ వీఆర్‌ఓ, వీఆర్‌ఏలలో ఎంత మంది డిగ్రీ, ఇంటర్ పూర్తిచేశారు. వారి విద్యార్హతలను సేకరించి ప్రభుత్వానికి పంపారు. వీటన్నింటి నేపథ్యంలో నెలాఖరులోగా వారికి పరీక్ష నిర్వహించి అర్హత ఉన్న వారిని జీపీఓలుగా ఎంపిక చేసి గ్రామాల్లో భూ భారతి చట్టం అమలు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఫ నియామకం ప్రక్రియ వేగిరం చేసిన యంత్రాంగం
ఫ ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తి
ఫ ప్రభుత్వానికి చేరిన వీఆర్‌ఓ, వీఆర్‌ఏల విద్యార్హతల నివేదిక
ఫ నెలాఖరులో పరీక్ష నిర్వహణకు సన్నాహాలు
ఫ భూ భారతి చట్టం బాధ్యతలు అప్పగించే అవకాశం
దరఖాస్తు చేసుకున్నవారు 238
వీఆర్‌ఓలు 99 వీఆర్‌ఏలు 93
తిరస్కరణకు గురైన అర్జీలు 46
నిబంధనల ప్రకారం నియామకం
జీపీఓల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వ నియ మ, నిబంధనల ప్రకారం నియామకాన్ని చేపడతాం. రెవెన్యూ గ్రామాల వారీగా జీపీఓలు పనిచేయాల్సి ఉంటుంది. జూన్ 2న భూ భారతి చట్టం అమలులోకి రానుండడంతో జీపీఓల నియామక ప్రక్రియను వేగవంతమైంది.
– పి.రాంబాబు, అదనపు కలెక్టర్, సూర్యాపేట

త్వరలో గ్రామ పాలనాధికారులు