
ఆగని రేషన్ బియ్యం దందా!
కోదాడ : రేషన్ బియ్యం దందా ఆగడం లేదు. సన్నబియ్యం పంపిణీ చేస్తున్నప్పటికీ డీలర్ల మాయజాలంతో ఈ దందా ఇంకా కొనసాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రేషన్ షాపుల్లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం నాణ్యతగా లేవనే ప్రచారంతో చాలామంది లబ్ధిదారులు బియ్యం తీసుకోకపోవడం లేదు. వీరి బియ్యాన్ని డీలర్లు తక్కువ ధరకు కొని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
చనిపోయిన వారి పేర్లు తొలగించడం లేదు..
ఆహార భద్రత కార్డులున్నవారికి ఒక యూనిట్‌కు 6 కిలోలు, అంత్యోదయ కార్డుదారులకు 35 కేజీలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కేజీల చొప్పున బియ్యం ఇస్తుంటారు. లబ్ధిదారులలో ఎవరైనా చనిపోతే ఆ విషయాన్ని డీలర్ సంబంధిత అధికారులుకు సమాచారం ఇచ్చి వారిపేరును తొలగించాలి. కానీ, జిల్లా వ్యాప్తంగా కొన్ని సంవత్సరాలుగా చనిపోయిన లబ్ధిదారుల పేర్లను తొలగించడం లేదు. వీరి పేరుతో మంజూరైన బియ్యాన్ని రేషన్ డీలర్లు పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో 23 మంది చనిపోయినప్పటికీ అధికారులు వారి పేర్లను తొలగించలేదు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా ఇలాంటి వారు వేలల్లో ఉంటారని కొందరు డీలర్లే అంటున్నారు.
సన్నబియ్యమైనా తీసుకోవడం లేదు..
గ్రామాల్లో 90 శాతం మందికి తెల్ల రేషన్‌కార్డులున్నాయి. వీరిలో ఎక్కువ మంది ఉన్నత వర్గాల వారు ఉన్నారు. దీంతో వీరు రేషన్ బియ్యం తీసుకోవడం లేదు. గతంలో దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేసిన సమయంలో డీలర్ల వద్ద 20 శాతం మంది మాత్రమే బియ్యం తీసుకెళ్లేవారు. సన్నబియ్యం పంపిణీ మొదలు పెట్టిన తరువాత గత నెలలో 50 నుంచి 70 శాతం మంది బియ్యం తీసుకెళ్తున్నారు. మిగతా వారు డీలర్లేకే అమ్మకానికి మొగ్గుచూపుతున్నారు. గతంలో దొడ్డు బియ్యానికి కిలోకి రూ.7 ఇచ్చిన డీలర్లు ప్రస్తుతం సన్న బియ్యం కేజీకి రూ.15 వరకు ఇస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం కొత్తవని అందువల్ల అన్నం వండినప్పుడు కొంత మేర ముద్దగా మారుతుందని, కొన్ని రోజలు పోతే ముద్దగా మారదని అధికారులు అంటున్నారు.
ఫ చనిపోయిన వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించని అధికారులు
ఫ వారిపేరుతోనూ బియ్యం కోటా తెస్తున్న డీలర్లు
ఫ లబ్ధిదారుల నుంచి కొని బ్లాక్‌మార్కెట్‌లో అమ్మకాలు
ఫ చర్యలు తీసుకుంటున్నామారనితీరు
అనంతగిరి మండలం గోండ్రియాల రేషన్ డీలర్ ఇటీవల సన్న బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా అధికారులు ఆకస్మికదాడి చేసి పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఉన్నత వర్గాల వారికి తెల్ల రేషన్ కార్డులుండగా వారు సన్నబియ్యం తీసుకోవడం లేదని సమాచారం. వీరినుంచి కిలో రూ.15లకు కొనుగోలు చేసిన డీలర్ ఈ బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్‌లో కిలో రూ.30లకు అమ్ముకుంటూ అధికారులకు పట్టుబడడంతో అతన్ని సస్పెండ్ చేశారు.
అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో చనిపోయిన లబ్ధిదారుల పేరుతో స్థానిక రేషన్ డీలర్ కొన్ని నెలలుగా బియ్యం డ్రా చేసి బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుంటున్నాడు. ఇటీవల దీనిపై ఒకరు ఫిర్యాదు చేయగా ప్రాథమికంగా విచారణ చేసిన అధికారులు 23 మంది చనిపోయినా వారి పేరుమీద బియ్యం డ్రా చేస్తున్నాడని గుర్తించి అతన్ని సస్పెండ్ చేశారు.
చనిపోయిన వారి పేర్లు తొలగించాలి
రేషన్ కార్డుల్లో పేరున్న లబ్ధిదారులు చనిపోతే ఆ విషయాన్ని డీలర్లు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి వారి పేర్లను తొలగించాలి. వారిపేరుతో బియ్యం డ్రాచేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డివిజన్ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో విచారణ చేయించి చనిపోయిన వారిపేర్లు తీసివేస్తాం.
– సీహెచ్.సూర్యనారాయణ, ఆర్డీఓ కోదాడ
జిల్లాలో రేషన్ దుకాణాలు 610
సాధారణ రేషన్ కార్డులు 3,04,343
అంత్యోదయ కార్డులు 19,817
అన్నపూర్ణ కార్డులు 39
లబ్ధిదారులు 9,49,193
ప్రతినెలా ఇచ్చే బియ్యం 6,042.72
(మెట్రిక్ టన్నులు)