
ప్రాణాలు తీస్తున్నరు!
ప్రైవేట్ ఆస్పత్రుల్లో అర్హతకు మించి వైద్యం
గతంలో జరిగిన మరో సంఘటన
చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు. అయితే మూడో కాన్పులో మగపిల్లవాడు కావాలనుకున్నారు. మూడో సారి గర్భవతి కాగా స్కానింగ్ చేయించారు. ఆడపిల్లఅని తేలడంతో భర్తతో పాటు బంధువులు కలిసి ఆ గర్భిణికి అబార్షన్ చేయించాలనుకున్నారు. అయితే 11నెలల క్రితం హుజూర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాన్ని సంప్రదించారు. మరో ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేసే నర్సుతో అబార్షన్ చేయించేందుకు సిద్ధమయ్యారు. ఈవిషయం కాస్తా మీడియాకు తెలిసిందని వెంటనే పెదవీడు గ్రామ సమీపంలోని ఓ తోటలోకి తీసుకెళ్లి గర్భిణికి ట్యాబ్లెట్లు, ఇంజక్షన్‌తో అబార్షన్ చేస్తుండగా వైద్యం వికటించి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో వెంటనే చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.
సూర్యాపేటటౌన్: పవిత్రమైన డాక్టర్ వృత్తిని కొంత మంది అభాసుపాలు చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా అర్హత లేకున్నా వైద్యం చేస్తూ రోగుల ప్రాణాల. ఎంబీబీఎస్ చదవకపోయినా.. ఎం.డి. చేయకున్నా.. డాక్టర్లుగా చలామణి అవుతూ ధనార్జనే ధ్యేయంగా రోగుల ప్రాణాలు బలిగొంటున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సూర్యాపేట పట్టణంలో వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది.
అర్హతకు మించి వైద్యంతో నిండుప్రాణం బలి
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీసాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి 20 రోజుల క్రితం జిల్లా కేంద్రంలో నివాసముండే ఓ మహిళ గర్భసంచి సమస్య ఉందని వెళ్లింది. అయితే పరీక్షించిన వైద్యులు గర్భసంచిలో బుడిగలు వచ్చాయని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. కానీ ఆ మహిళ కుటుంబ సభ్యులు మాత్రం ల్యాప్రోస్కోపి ద్వారా ఆపరేషన్ చేయాలని కోరారు. దీంతో వెంటనే వైద్యులు ల్యాప్రోస్కోపి ద్వారా ఆపరేషన్ చేస్తుండగా కడుపులో పేగు కట్టయింది. ఆ విషయం కుటుంబ సభ్యులకు చెప్పారు. నార్మల్ ఆపరేషన్ చేస్తే సెట్ అవుతుందని చెప్పి వైద్యులు ఆరు గంటల పాటు వైద్యం చేశారు. అయినా ఆ మహిళకు బ్లడ్ బ్లీడింగ్ అవుతూనే ఉన్నా వారం రోజుల పాటు అలాగే ఆ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ చేశారు. తీరా పరిస్థితి విషమించడంతో ఈ హాస్పిటల్ యాజమాన్యమే హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. అయితే ఇదే ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ డాక్టర్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తిచేసి ఇక్కడ ఎం.డీ.గా చలామణి అవుతున్న విషయం తనిఖీల్లో బయటపడింది. సదరు డాక్టర్‌పై కేసు నమోదు అయినా ఆ ఆస్పత్రి యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఓ ప్రాణంపోయాక జిల్లా వైద్యాధికారి స్పందించి చర్యలు తీసుకోవడం గమనార్హం.
ఫ వచ్చీరాని వైద్యంతో ప్రాణాలతో చెలగాటం
ఫ సూర్యాపేట పట్టణంలో తాజాగా వైద్యం వికటించి మహిళ మృతి
కలెక్టర్‌కు నివేదిక
గత నెలలో సూర్యాపేటలో శరత్‌కార్డియాక్ సెంటర్, యాపిల్ స్కానింగ్ సెంటర్, శ్రీసాయిగణేష్ , శ్రీకృష్ణ ఆస్పత్రుల్లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు తనిఖీలు చేయగా నకిలీ డాక్టర్ల గుట్టు రట్టయిన విషయం తెలిసిందే. శరత్‌కార్డియాక్ సెంటర్‌లో డాక్టర్ లేకుండా ల్యాబ్ టెక్నీషియనే నడిస్తున్నాడు. యాపిల్ స్కానింగ్ సెంటర్‌లో డాక్టర్ కిరణ్ ఎంబీబీఎస్ పూర్తి చేసి నకిలీ సర్టిఫికెట్లతో ఎం.డీ రేడియాలజిస్ట్‌గా చలామణి అవుతున్నాడు. శ్రీకృష్ణ ఆస్పత్రిలో డాక్టర్ రవిశేఖర్ అనస్తీషియా అర్హత ఉండగా జనరల్ ఫిజీషియన్‌గా అవతారం ఎత్తి సర్జరీలు చేస్తున్నట్టు బట్టబయలైంది. సాయి గణేష్ హాస్పిటల్ నడిపిస్తున్న డాక్టర్ సందీప్‌కుమార్ చైనాలో ఎంబీబీఎస్ చేసి ఎం.డీగా చలామణి అవుతున్న విషయం బయటపడింది విదితమే. ఈ నివేదికను కలెక్టర్‌కు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు అందజేశారు. కాగా నాలుగు ఆస్పత్రులను డీఎంహెచ్‌ఓ సీజ్ చేశారు.
మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ సీజ్
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీసాయి గణేష్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ను సోమవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్స్ నిర్లక్ష్య వైఖరి వ్యవహరించడంతో నిబంధనల మేరకు మొదట నోటీసులు అందజేశామన్నారు. అయినా మార్పు రాకుండా నిర్లక్ష్యంగా వైద్యం చేయడంతో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రిని సీజ్ చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ జయ మనోహర, పీఓఎన్‌హెచ్ అనితా రాణి, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఇన్‌చార్జి డెమో మనోహర రాణి తదితరులు పాల్గొన్నారు.

ప్రాణాలు తీస్తున్నరు!