సూర్యాపేట టౌన్: ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ(శనివారం) నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు కొనసాగనున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించనున్నారు.
జిల్లాలో 950 పాఠశాలలు
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కలిపి మొత్తం 950 ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఆయా స్కూళ్లలో 70వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు రోజూ ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలో 67 సెంటర్లలో 17,912 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాలు కేటాయించిన స్కూళ్లలో మధ్యాహ్నం పాఠశాలలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వుల్లో వెల్లడించారు.
ఫ ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు స్కూళ్లు
ఫ పదవ తరగతి పరీక్షలు జరిగే
స్కూళ్లలో మధ్యాహ్నం వేళ బడి
ఫ వచ్చేనెల 23వ తేదీ వరకు అమలు
మధ్యాహ్న భోజనం యథావిధిగా ఉంటుంది
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను శనివారం నుంచి ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఒంటిపూట నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం యథావిధిగా కొనసాగుతుంది. ప్రైవేట్ పాఠశాలల్లోనూ కచ్చితంగా ఒంటిపూట బడులు నిర్వహించాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం.
– అశోక్, డీఈఓ, సూర్యాపేట