సింహ వాహనంపై ఊరేగుతున్న నృసింహుడు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా జరుగుతున్నాయి. ఆలయంలో గురువారం ఉదయం నిత్య పూజలు చేపట్టారు. అనంతరం అలంకార సేవను ఆలయ తిరు మాడ వీధిలో ఊరేగించారు. అదేవిధంగా ఉదయం శ్రీనృసింహస్వామి వారిని గోవర్ధనగిరిధారి అలంకర సేవలో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆలయంలో ఆచార్యులు, రుత్వికులు, పారాయణీకులు ప్రబంధ పారాయణం, మూలమంత్ర జపములు, నిత్యారాధనలు కొనసాగించారు. అనంతరం శ్రీస్వామి వారిని సింహ వాహనంపై ఊరేగించారు. వేడుకల్లో ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటచార్యులు, అధికారులు, పారాయణీకులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీస్వామి వారిని జగన్మోహిని అలంకార సేవలో ఊరేగిస్తారు. రాత్రికి ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.