యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని కార్వాన్‌కు చెందిన శ్రీవిశ్వాంజనేయ భక్త సమాజం, యాదగిరిగుట్టలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహిళా భజన మండలి, వేల్పుపల్లి శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన మసన చెన్నప్ప ఆధ్వర్యంలో ఉపనిషత్ వైభవంపై ఉపన్యాసం చేశారు. హాలియాకు చెందిన చేబ్రోలు నారాయణదాసు సమక్షంలో సుభద్రా పరిణయం హరికథ గానం చేశారు. స్వరరాగ ఆర్ట్స్ ఆకాడమీ ఆధ్వర్యంలో భక్తి సంగీతం, మెరుగు రాఘవేంద్రచే తబలా వాయిద్యం చేపట్టారు. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రముఖ జానపద, సినీ నేపథ్య గాయని తేలు విజయ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమం కొనసాగింది. ఇక పలువులు కళాకారులు కూచిపూడి, భరత నాట్యం, సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు.