అనుమానాస్పద స్థితిలో ఇంటర్‌ విద్యార్థిని మృతి | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో ఇంటర్‌ విద్యార్థిని మృతి

Published Sun, Feb 11 2024 2:28 AM

- - Sakshi

సూర్యాపేట రూరల్‌ : సూర్యాపేట మండలంలోని ఇమాంపేటలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి ఇంటర్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. సూర్యాపేట పట్టణానికి చెందిన వెంకన్న, భాగ్యమ్మల కుమార్తె దగ్గుపాటి వైష్ణవి (17) గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గురుకుల పాఠశాలలో శనివారం ఫేర్‌వెల్‌ డే ఉండగా విద్యార్థిని తండ్రి ఉదయం 9గంటలకు వచ్చి పూలు , గాజులు ఇచ్చి వెళ్లాడు. సాయంత్రం పాఠశాల ఆవరణలో జరిగిన ఫేర్‌వెల్‌డేలో వైష్ణవి పాల్గొన్నది. అయితే ఈ కార్యక్రమం జరుగుతుండగానే వైష్ణవి హాస్టల్‌ గదికి వెళ్లిపోయింది. గంట తర్వాత తోటి విద్యార్థులు వెళ్లి చూడగా వైష్ణవి అపస్మారకస్థితిలో ఉంది.

ఈ విషయాన్ని వారు వెంటనే ప్రిన్సిపల్‌తో పాటు సిబ్బందికి చెప్పడంతో వైష్ణవిని సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. హాస్టల్‌ సిబ్బంది ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు కూడా తెలియజేయడంతో వారు ఏరియా ఆస్పత్రికి వచ్చారు. తమ కూతురును విగతజీవిగా చూసి బోరున విలపించారు. శనివారం సాయంత్రం పాఠశాలలో జరిగిన ఫేర్‌వెల్‌ డేకు వెళ్లేందుకు తయారైన తర్వాత వీడియో కాల్‌ చేసి తమతో నవ్వుతూ మాట్లాడిందని విద్యార్థిని తల్లిదండ్రులు వెంకన్న, భాగ్యమ్మ రోదిస్తూ తెలిపారు.

తమ కూతురు కొన్ని రోజుల క్రితం ఇంటికి వచ్చిన సమయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కలిసి ఎలా చదువుతున్నావని పలకరించిందని చెప్పారు. అప్పుడు తమ కూతురు.. హాస్టల్‌లో అన్నం బాగుండడం లేదని, రాళ్లు వస్తున్నాయని చెప్పగా అక్కడి నుంచే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఫోన్‌లో ప్రిన్సిపల్‌తో మాట్లాడారని చెప్పారు. ఈ విషయం మనసులో పెట్టుకుని తమ కూతురును వేధించారని, దీంతోనే మనస్తాపంతో మృతిచెందిందని, తమ కూతురును హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపించారు. వైష్ణవి మృతదేహంపై గాయాలు ఉండడంతో తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదే విషయమై కళాశాల ప్రిన్సిపల్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఫోన్‌ స్విచ్చాఫ్‌లో ఉంది. సూర్యాపేట రూరల్‌ పోలీసులు ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు. సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం హాస్టల్‌కు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, వారం రోజుల క్రితం భువనగిరిలోని ఎస్సీ హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరుకముందే సూర్యాపేటలో మరో బాలిక అనుమానాస్పదస్థితిలో మృతిచెందడం కలకలం రేపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement