భూదాన అంకురార్పణకు 72ఏళ్లు | - | Sakshi
Sakshi News home page

భూదాన అంకురార్పణకు 72ఏళ్లు

Apr 18 2023 1:46 AM | Updated on Apr 18 2023 1:46 AM

భూదాన్‌ పోచంపల్లిలోని వినోబాభావే, వెదిరె రామచంద్రారెడ్డిల కాంస్యవిగ్రహాలు  - Sakshi

భూదాన్‌ పోచంపల్లిలోని వినోబాభావే, వెదిరె రామచంద్రారెడ్డిల కాంస్యవిగ్రహాలు

భూదాన్‌పోచంపల్లి : భూదానోద్యమం అంకురార్పణ జరిగి నేటికి సరిగ్గా 72 ఏళ్లు పూర్తి అయ్యాయి. సెంట్‌ భూమి కోసం కురుక్షేత్ర యుద్ధాలు జరిగిన మన దేశంలో అడిగిందే తడవుగా వెదిరె రాంచంద్రారెడ్డి ఒకటి, కాదు రెండు కాదు ఏకంగా 100ఎకరాల భూమి దానంగా ఇవ్వడం ప్రపంచ చరిత్రలోనే పోచంపల్లిలో 1951 ఏప్రిల్‌ 18న జరిగింది. ఈ ఘటన దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అయ్యింది. దాంతో పోచంపల్లికి భూదాన గంగోత్రిగా అంతర్జాతీయ ఖ్యాతి లభించింది.

స్ఫూర్తినిచ్చిన భూదానం..

గాంధీజీ శిష్యుడైన ఆచార్య వినోబాభావే దేశమంతటా పాదయాత్రలు చేస్తున్న సమయంలో సర్వోదయ నాయకుడు శ్రీ రామకృష్ణ దూత్‌ ఆహ్వానం మేరకు 1951 ఏప్రిల్‌15న హైదరాబాద్‌ సమీపంలోని శివరాంపల్లిలో నిర్వహించే సర్వోదయ సమ్మేళనంలో తన సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఆ సమయంలో నల్లగొండ జిల్లాలో జరుగుతున్న కల్లోల పరిస్థితులను తెలుసుకొని పరిష్కార మార్గాన్ని కనుగొనడానికి వెంటనే పాదయాత్రగా బయలుదేరి 17న పోచంపల్లికి చేరుకున్నారు. సాయంత్రం హరిజనవాడలో తిరిగి ఆ రోజు రాత్రి పీర్లకొట్టం(ఇప్పుడున్న వినోబాభావే మందిరం)లో బస చేశారు. మరుసటి రోజు ఏప్రిల్‌ 18న చెరువు సమీపంలో నున్న జువ్విచెట్టు కింద దళితులతో సమావేశమయ్యారు. తమకు కొంత భూమిని ఇప్పిస్తే సాగు చేసుకొని జీవిస్తామని దళితులంతా తమ గోడును వెల్లబోసుకున్నారు. దాంతో వినోబాభావే స్పందిస్తూ, మీలో ఎవరైనా భూమిని దానం చేసేవారున్నారని అడగటంతో అక్కడే ఉన్న పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి వెంటనే లేచి తన తండ్రి జ్ఞాపకార్థం 100ఎకరాల భూమిని దానం చేస్తానని ప్రకటించి అక్కడికక్కడే దానపత్రాన్ని రాసి నిండుసభలో వినోబాభావేకు అందించారు. దానరూపేణ లభించిన ఆ భూమిని వెంటనే పేదలకు పంచి భూదానోద్యామానికి బీజం వేశారు. ఇలా ప్రారంభమైన భూదానోద్యమ స్ఫూర్తి విశ్వవ్యాప్తమై పోచంపల్లికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇలా 100 ఎకరాల్లో మెదలైన ఈ ఉద్యమం దేశమంతటా విస్తరించి 44లక్షల ఎకరాల భూమిని దానంగా సేకరించి 40లక్షల మంది భూమి లేని నిరుపేదలకు పంచిపెట్టబడింది. మహోన్నతమైన భూదానోద్యమం భూ సంస్కరణలకు, దేశంలో ఆర్థిక అసమానతలు తొలగడానికి దోహదపడింది.

పోచంపల్లితో విడదీయని అనుబంధం

ఆచార్య వినోబాభావేకు పోచంపల్లితో విడదీయని అనుబంధం ఉంది. మొదటిసారి 1951లో పోచంపల్లికి వచ్చారు. అలాగే 1956 గాంధీ వర్ధంతి జనవరి 30న రెండోసారి వచ్చారు. భూదానోద్యమానికి కార్యోన్ముఖునిగా చేసిన పోచంపల్లిని భూదాన గంగోత్రిగా అభివర్ణిస్తూ తన రెండో జన్మస్థలంగా వినోబాభావే పేర్కొనడం విశేషం. వినోబాభావే మరణాంతరం భారత ప్రభుత్వం ఆయన ఆవిశ్రాంత కృషికి గాను 1982లో ‘భారతరత్న’ బిరుదును ప్రకటించింది.

వెదిరె విగ్రహం ఏర్పాటు చేయాలని..

భూదానోద్యమం ద్వారా మన జిల్లా, రాష్ట్రం, తద్వారా దేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి తెచ్చిపెట్టిన వెదిరె రాంచంద్రారెడ్డి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని ఇటీవల వారి వారసులు మంత్రి జగదీశ్‌రెడ్డిని స్వయంగా కలిసి విన్నవించారు. అలాగే కేంద్రం వెదిరె రాంచంద్రారెడ్డి పేరిట తపాల బిళ్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదరణకు నోచుకొని వినోబాభావే మందిరాన్ని టూరిజం పార్క్‌తో అనుసంధానం చేసి అభివృద్ధి పర్చాలని ప్రజలు కోరుతున్నారు.

నేడు పోచంపల్లిలో ర్యాలీ..

తెలంంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం భూదానం జరిగిన పట్టణ కేంద్రంలోని వినోబా భావే మందిరం సమీపంలో గల జువ్వి చెట్టు నుంచి కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహం వరకు భూహక్కుల ఉద్యమకారుల ర్యాలీ నిర్వహించనున్నామని సమాఖ్య ప్రతినిధి కరుణాకర్‌రెడ్డి తెలిపారు. భూమి హక్కులకు, హద్దులకు స్పష్టత, భద్రత, ఽభూహక్కుల చిక్కులు, ధరణి సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వేములవాడ ఒగ్గు కళాకారులచే నృత్య విన్యాసాలుంటాయని చెప్పారు.

ఆర్థిక అసమానతలు తొలగించిన భూదానం

భూదానోద్యమం ద్వారానే దేశంలో భూసంస్కరణలు

వినోబాభావేతో మాట్లాడుతున్న 
వెదిరె రామచంద్రారెడ్డి (ఫైల్‌)1
1/2

వినోబాభావేతో మాట్లాడుతున్న వెదిరె రామచంద్రారెడ్డి (ఫైల్‌)

భూదాన్‌ పోచంపల్లిలోని భూదాన స్థూపం 2
2/2

భూదాన్‌ పోచంపల్లిలోని భూదాన స్థూపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement