నిత్యకల్యాణం, పచ్చతోరణంలా తెలంగాణ

జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఈఓ అశోక్‌ 
 - Sakshi

మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రం నిత్యకల్యాణం పచ్చ తోరణంలా విరాజిల్లుతోందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి పేర్కొన్నారు. భద్రాద్రి రామయ్య చల్లని దీవెనలతో సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరుగులు పెట్టిస్తున్నారని ఆయన తెలిపారు. లోక కల్యాణార్థం శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

‘అథ్లెటిక్స్‌’ ఉపాధ్యక్షుడిగా గడ్డం వెంకటేశ్వర్లు

సూర్యాపేటటౌన్‌ : తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడిగా గడ్డం వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల జనరల్‌ బాడీ సమావేశంలో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నట్టు పేర్కొన్నారు. వెంకటేశ్వర్లుకు జిల్లా క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, టీచర్లు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చాం

సూర్యాపేటటౌన్‌ : ఈ విద్యా సంవత్సరం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్‌ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఏప్రిల్‌ 3 నుంచి 13వ తేదీ వరకు జరిగే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చే పని ముగిసిందన్నారు.ఉదయం 8.30గంటల వరకు పరీక్ష కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలన్నారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోనే అగ్రగామిగా సూర్యాపేట జిల్లా నిలుస్తుందన్నారు.

బల్లకట్టు వేలం మళ్లీ వాయిదా

సూర్యాపేటటౌన్‌ : జిల్లా పరిషత్‌ కార్యాలయం ఆధీనంలో గల చింతలపాలెం మండలంలోని చింత్రియాల, బుగ్గమాదారం రేవుల్లో 2023 –24 ఆర్థిక సంవత్సరంలో బల్లకట్టు నిర్వహణకు బుధవారం నిర్వహించిన వేలంలో కాంట్రాక్టర్లు ఎవరూ పాల్గొనకపోవడంతో మళ్లీ వాయిదా వేశారు. ఈ విషయాన్ని జెడ్పీ సీఈఓ సురేష్‌ తెలిపారు. ఏప్రిల్‌ 6వ తేదీ సాయంత్రం 4గంటలకు తిరిగి వేలం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈనెల 25న నిర్వహించిన వేలంలో కూడా ఎవరూ పాల్గొనలేదని తెలిపారు.

ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి

తిరుమలగిరి (తుంగతుర్తి): పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి కోటాచలం కోరారు. తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో బుధవారం కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సంకెపల్లి రఘునందన్‌రెడ్డి, వైద్యాధికారిణి మల్లెల వందన, సీహెచ్‌ఓ బిచ్చునాయక్‌, స్వరూపకుమారి, సంధ్యారాణి, ప్రవళిక, నర్సింహారెడ్డి, పూర్ణశేఖర్‌, విజయ్‌, ధనమ్మ పాల్గొన్నారు.

Read latest Suryapet News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top