
మాట్లాడుతున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి
నల్లగొండ టూటౌన్: సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలకు చెందిన నాయకులపై దాడులు చేయిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గవర్నర్ వ్యవస్థను వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులను గవర్నర్ నెలలు గడుస్తున్నా ఆమోదించకపోవడంతో అభివృద్ధికి ఆటంకంతో పాటు యూనివర్సిటీల్లో ఉద్యోగాల భర్తీ చేయలేకపోతున్నట్లు చెప్పారు. ప్రతి పక్ష పార్టీల గొంతు నొక్కడమే పనిగా కేంద్ర సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. రాఫేల్, అదానీ కంపెనీల లక్షల కోట్ల షేర్ల స్కాంపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ఆయన ప్రశ్నించారు. వంద కోట్ల దానికి భూతద్ధంలో చూపిస్తున్న కేంద్రం కావాలనే కేసీఆర్ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు మంత్రి కేటీఆర్‌పై బురదజల్లేందుకు కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కొంతమంది స్వార్థం కోసం చేశారని, దానిని రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లు కేటీఆర్‌కు అంటగట్టే ప్రయత్నం చేయడం సబబుకాదన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటంబం అని, రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసి బంగ్లాను ఖాళీ చేయించడం కక్షసాధింపేనని అన్నారు.
ఫ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి