హిరమండలం: రాష్ట్రంలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. వేసవి తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు భయపడి జనసంచారం లేక రోడ్లు కళాహీనంగా మారుతున్నాయి. దీనినుంచి ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో విద్యా సంస్థలకు గత నెల 24 నుంచి సెలవులు ప్రకటించారు. అయితే అంగన్‌వాడీ కేంద్రాలకొచ్చే సరికి చిన్నారుకు మాత్రం సెలవులు ప్రకటించడంలో సర్కార్ చోద్యం చూస్తోంది. ఎండలకు చిన్నారుల ఇబ్బందులు కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదు. భానుడు భగభగ మండిపోతుంటే ఎండలకు చిన్నారులు ఎలా వస్తారనే కనీసం ఇంగిత జ్ఞానం లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పటికే పక్కరాష్ట్రం తెలంగాణలో అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులిచ్చారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం వేసవి సెలవులు ప్రకటించాలన్న ఆలోచన రాకపోవడం గమనార్హం.
జిల్లాలో పరిస్థితి గమనిస్తే..
శ్రీకాకుళం జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు 16 ఉన్నాయి. వీటి కింద 3,395 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో సంరక్షణ పొందుతున్న వారికి పౌష్టికాహారం అందించి, ఆటపాటలు, అక్షరాలు నేర్పించడం కార్యకర్తల విధులు. ఏడాది పొడువునా కేంద్రాల్లో చిన్నారులకు ఇదే పద్ధతి కొనసాగుతుంది. అయితే వేసవి సమీపించడంతో రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కానీ అంగన్‌వాడీ కేంద్రాలకు దీన్ని వర్తింపజేయలేదు. దీంతో ఎండలకు చిన్నారును పంపించేందుకు తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. మండుతున్న ఎండలకు పెద్దలే గడప దాటి కాలు బయటికి పెట్టడానికి భయపడుతుంటే.. పిల్లలను ఎలా పంపిస్తామని ప్రశ్నిస్తున్నారు. కొందరు చిన్నారులు కేంద్రాలకు వస్తున్నా అక్కడ వారికి గాలి లేకపోవడంతో ఉక్కపోతకు విలవిలలాడిపోతున్నారు. వీరిని సముదాయించలేక ఆయాలు తంటాలు పడుతున్నారు. వేసవిలో చిన్నారులను కేంద్రాల్లో ఉంచాలని చెబుతున్న ప్రభుత్వం.. వారికి సౌకర్యాలు అందించడంలో విఫలం అవుతోందని వాపోతున్నారు. మే 1వ తేదీ నుంచి అంగన్‌వాడీ ఆయాలకు, మే 15 నుంచి కార్యకర్తలకు సెలవులు ప్రకటించినట్లు సమాచారం.
యూనియన్ నేతల మండిపాటు
ఎన్నికల సమయంలో వివిధ హామీలను ప్రకటించారని, కానీ ఒక్కటీ నెరవేర్చకపోగా తమపై విపరీతమైన పనిభారం మోపడం ఎంతవరకు సమంజసమని అంగన్‌వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఎండలకు లెక్క చేయకుండా ఒక వైపు పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వానికి జాలి, దయ లేదని ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. ఎండలు మండిపోతున్నా కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించకుండా కక్షపూరిత ధోరణి అవలంబిస్తోందని యూనియన్ నేతలు మండిపడుతున్నారు.
వేసవి కారణంగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా ఎండలు కాసే అవకాశం ఉంది. అధికారులు స్పందించి పాఠశాలలు, కళాశాలలు మాదిరిగా అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలి.
– సిర్ల ప్రసాద్, సీఐటీయూ నాయకుడు
పెద్దలోగిడి అంగన్‌వాడీ కేంద్రంలో
విద్యనభ్యసిస్తున్న
చిన్నారులు
అంగన్‌వాడీల్లో వేసవి తీవ్రతతో చిన్నారుల విలవిల
తగ్గుతున్న హాజరు శాతం
సెలవులు ప్రకటించని ప్రభుత్వం


