రైతులను మోసగిస్తే చర్యలు
ఆమదాలవలస: రైతులను దోచుకోవాలని చూస్తే చర్యలు తప్పవని శ్రీకాకుళం ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆమదాలవలసలోని రాష్ట్ర గిడ్డంగుల కార్యాలయంలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిల్లర్ల తప్పుడు విధానాలు అనుసరిస్తున్నారని రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపడుతున్నామన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని అందిస్తున్నా కొందరు మిల్లర్లు ఎఫ్‌సీఐకి పంపే బియ్యంలో నూక శాతం ఎక్కువగా వస్తోందని చెబుతూ గిడ్డంగులకు తీసుకువచ్చిన బియ్యం లారీల లోడింగ్–అన్‌లోడింగ్ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లు గుర్తించారు. మిల్లర్లు సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు మిల్లుల వద్ద రోజుల తరబడి గడపాల్సి వస్తోందన్నారు. తనిఖీల్లో తహసీల్దార్ ఎస్.రాంబాబు, వ్యవసాయాధికారి మెట్ట మోహనరావు, పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.


