క్రాస్ కంట్రీ పోరుకు వేళాయె..!
● రేపు జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు
● కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఎంపికలు
● రాణిస్తే నేరుగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: క్రాస్ కంట్రీ ఎంపికల పోటీలకు రంగం సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి జరగనున్న జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ(దూరపు పరుగు) ఎంపిక పోటీలకు నిర్వాహకులు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశారు. సెలక్షన్ కమిటీని, టెక్నికల్ అఫీషియల్స్‌ను నియమించారు. శనివారం సాయంత్రం తుది మెరుగులు దిద్దనున్నారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 300 నుంచి 500 మంది అథ్లెట్లు పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ రాణించినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు.
నాలుగు వయో విభాగాల్లో పోరు
జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు మొత్తం నాలుగు వయో విభాగాల్లో జరగనున్నాయి. అండర్–16, 18, 20, సీనియర్స్ విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా నిర్వహించనున్నారు. అండర్–16 నుంచి అండర్–20 మధ్య మూడు వయో విభాగాలకు 2012 జనవరి 24 నుంచి 2006 జనవరి 25 మధ్య జన్మించినవారు అర్హులుగా నిర్ణయించారు. సీనియర్స్ పురుషులు, మహిళల విభాగానికి 2006 జనవరి 24వ తేదీలోపు జన్మించినవారు అర్హులని సెలక్షన్ కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. క్రీడాకారులు మరిన్ని వివరాల కోసం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కె.మాధవరావు(9441570361)ను సంప్రదించాలని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు(వాసు), అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, కార్యదర్శి మెంటాడ సాంబమూర్తిలు తెలిపారు.
ఎంపికై తే రాష్ట్రస్థాయి పోటీలకు
ఇక్కడ ఎంపికై న అథ్లెట్లను రాష్ట్రస్థాయి పోటీలకు సెలెక్ట్ చేయనున్నారు. కాకినాడ వేదికగా ఈనెల 24వ తేదీన జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ ఛాంపియన్‌షిప్–2025 పోటీలకు పంపించనున్నారు. ఇక్కడ రాణించినవారిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు.
జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. కేఆర్ స్టేడియంలో జరిగే ఎంపికలకు హాజరయ్యే బాలబాలికలు తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో ఉదయం 8 గంటలకు గ్రౌండ్‌కు చేరుకోవాలి.
– మెంటాడ సాంబమూర్తి,
అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి
క్రాస్ కంట్రీ అథ్లెట్స్‌కు ఇదొక గొప్ప అవకాశం. జిల్లాస్థాయి ఎంపికలను క్రీడాకారులంతా సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ రాణించి రాష్ట్ర పోటీలకు ఎంపికవ్వాలి. అక్కడ రాణిస్తే జాతీయ పోటీలకు ఎంపిక కావచ్చు.
– కొన్న మధుసూదనరావు,
అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు
క్రాస్ కంట్రీ పోరుకు వేళాయె..!
క్రాస్ కంట్రీ పోరుకు వేళాయె..!
క్రాస్ కంట్రీ పోరుకు వేళాయె..!


