అనుమానాస్పదంగా యువకుడు మృతి
● హత్య చేశారని తల్లిదండ్రుల ఆరోపణ
నరసన్నపేట/టెక్కలి రూరల్: మండలంలోని చోడవరం వద్ద లుకలాం – కొమనాపల్లి రహదారి పక్కన వంశధార కాలువలో కోటబొమ్మాళి మండలంలోని తాడిపర్తి సమీప గోపాలపురం గ్రామానికి చెందిన మన్నేల సాయికుమార్ (21) అనుమానాస్పదంగా మృతి చెందాడు. ద్విచక్ర వాహన ప్రమాదంగా స్థానికులు, పోలీసులు భావిస్తున్నా.. తమ కుమారుడిని చెన్నాపురానికి చెందిన కర్రి రాజు తదితరులు హత్య చేశారని తల్లిదండ్రులు మన్నేల అప్పన్న, సావిత్రిలు ఆరోపిస్తున్నారు. దీంతో అప్పన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట ఇన్‌చార్జి ఎస్‌ఐ రంజిత్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. చోడవరం వద్ద వంశధార కాలువలో బుల్లెట్ బండి, దాని కింద సాయికుమార్ మృతదేహం సోమవారం ఉదయం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఇన్‌చార్జి ఎస్‌ఐ రంజిత్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు.
మృతిపై అనుమానాలు
సాయికుమార్ మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత బంధువులు హత్యగా అనుమానించారు. పళ్లు విరిగి ఉన్నాయని, నడుముపై తాడు గుర్తులు ఉన్నాయని తండ్రి అప్పన్న తెలిపారు. కర్రి రాజు తో తమకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని తెలిపారు. రెండు నెలల క్రితం 90 గొర్రెలు కర్రి రాజుకు విక్రయించామని, దానికి సంబంధించి రూ.13 లక్షలు ఇవ్వాల్సి ఉందన్నారు. అడ్వాన్స్‌గా రూ.50 వేలు ఇచ్చి మిగిలిన మొత్తం ఇవ్వకుండా వాయిదాలు వేస్తున్నారని.. ఈ డబ్బు కోసమే ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి శవమై కనిపించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కర్రి రాజు అతని స్నేహితులు పిట్ట శ్రీను, పిట్ట గంగడులతో కలిసి హతమర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి పొలంలో గొర్రెల మందను కర్రి రాజు వేశారని, అక్కడే సాయికుమార్‌కు భోజనం పెట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక్కడికి సమీపంలోనే కాలువలో మృతదేహం ఉండడంతో వారిపై అనుమానంగా ఉందని తెలిపా రు. కాగా సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్‌ఐ రంజిత్ మాట్లాడుతూ మృతదేహంపై ఎటువంటిగాయాలు లేవని ప్రమా దంగానే భావిస్తున్నామని తెలిపారు. అయితే కుటుంబ సభ్యుల ఆరోపణలను పరిగణలోనికి తీసుకొని అనుమానాస్పదంగా కేసు నమోదు చేశా మన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు.
అనుమానాస్పదంగా యువకుడు మృతి


