అధికార యంత్రాంగంపై ధ్వజం
● వాడీవేడిగా జిల్లా సమీక్ష సమావేశం
● అధికారులపై మండిపడిన ప్రజా ప్రతినిధులు
శ్రీకాకుళం: జిల్లాలో ప్రభుత్వ శాఖల పనితీరుపై ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, శాసనసభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సరైన వివరాలు లేకుండా డీఆర్‌సీకి ఎలా వస్తున్నారని నిలదీశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. తొలుత వ్యవసాయ శాఖకు సంబంధించిన చర్చ ప్రారంభం కాగా అధికారుల నివేదిక తప్పులు తడకగా ఉందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సభ దృష్టికి తీసుకువచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల్లో రైతుల సంఖ్యలో 46,000 తేడా ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు దీనిపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా దాన్ని సైతం రవికుమార్ అడ్డుకున్నారు. ఇదే విషయమే సుదీర్ఘంగా రెండు గంటలపాటు చర్చ జరిగిన తర్వాత ఇన్‌చార్జి మంత్రి కలగజేసుకుని ఆపారు. కానీ రవికుమార్ అంగీకరించకుండా సమీక్ష ఇదే సమావేశంలో జరగాలని పట్టుబట్టారు. దీంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జోక్యం చేసుకుని రవికుమార్ అడుగుతున్న ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా లేదా అని వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించగా, తాము పొరపాటున నమోదు చేశా మని అంకెలు మాత్రం సరైనవని చెప్పారు.
ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ మా ట్లాడుతూ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మళ్లీ రవికుమార్ ఎరువుల కొరత విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ ఏడాది పొటాషియం తీసుకురాలేదని నిలదీశారు. వ్యవసాయ శాఖాధికారు లే కాకుండా పలు శాఖల అధికారులు నిర్లక్ష్య ధోర ణిలో వ్యవహరిస్తున్నారని రవికుమార్‌తో పాటు మరికొందరు శాసనసభ్యులు ఆరోపించారు. తు ఫాన్ సందర్భంగా తడిచి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రవికుమార్ కోరగా జిల్లా మంత్రులతో పాటు కేంద్ర మంత్రి సైతం దీనికి అంగీకరించారు. ఏపీఐఐసీపై చర్చలో ఆమదాలవలస చక్కెర కర్మా గారాన్ని తీ సుకుని ఇండస్ట్రియల్ పార్కుగా అభివృద్ధి చేయా లని కోరారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జిల్లాకు పరిశ్రమలు వస్తుంటే స్థానికులు అడ్డుకుంటున్నారని సరుబుజ్జిలి మండలంలో థర్మల్, పలాసలో కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణాలపైనా పోరాడుతున్నారని తెలిపారు. ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లించేలా కేంద్రంతో సంప్రదిస్తాన ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పలాసలోని కిడ్నీ సెంటర్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ఎమ్మెల్యే శిరీష కోరారు. సమావేశంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస నాయుడు కలెక్టర్ దినకర్ పుండ్కర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా సమీక్ష సమావేశానికి అధికారులు సమగ్ర సమాచారంతో రావాలని ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశాలు ఇచ్చారు. అసంపూర్తి సమాచారంతో సమావేశానికి రావడం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు వివిధ శాఖల అధికారులు తడబడటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా సమీక్ష సమావేశాలు ఇకపై రెగ్యులర్‌గా నిర్వహిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రా మ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పెండింగ్ అంశాలను తన దృష్టికి తీసుకువస్తే వాటిని త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


