● యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
● ట్రాక్టర్లతో ఒడిశా తరలిస్తున్న వైనం
● రూ.కోట్లకు పడగలెత్తుతున్న ఇసుకాసురులు
కొత్తూరు:
కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ ఆయా పార్టీల నేతలకు వరంగా మారింది. పేరుకే ఉచిత ఇసుక పథకం తప్ప వినియోగదారులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. ట్రాక్టర్ ఇసుకకు రూ.వేలల్లో చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఉచిత ఇసుక పాలసీ కూటమి నేతల ధనార్జనకు మార్గమైంది. ప్రభుత్వ నిబంధనల మేరకు కూలీల చేత నదిలో ఉన్న ఇసుకకు ట్రాక్టర్‌కు లోడు చేయించాలి. అయితే అందుకు భిన్నంగా మండలంలోని కడుము కాలనీ, వసప గ్రామాల వద్ద ప్రొక్లెయినర్లతో లోడింగ్ చేస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
వసప, కడుము గ్రామాల వద్ద వంశధార నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో అక్రమార్కులకు ఇసుక వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఇసుక తరలింపుతో రోజుకు రూ.లక్షల్లో ఇసుకాసురులు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నదిలో ప్రొక్లెయినర్లతో ట్రాక్టర్లకు లోడింగ్ చేసి ఒక్కో ట్రాక్టర్‌కు రూ.500ల నుంచి రూ.1,000ల వరకు వసూలు చేస్తున్నారు. అంధ్రా నుంచి ఒడిశాకు ఇసుక తరలించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వంశధార నది నుంచి పగలంతా ట్రాక్టర్లతో కడుము కాలనీ, గొట్లభద్ర, కిమిడి–వారణాసి రోడ్లకు ఆనుకొని ఇసును డంపింగ్ చేసి ఎక్కువ మొత్తంలో నిల్వ చేస్తున్నారు. అనంతరం ఈ అక్రమ నిల్వలను రాత్రులు టిప్పర్లు, ట్రాక్టర్లతో ఒడిశాకు తరలిస్తున్నారు. అక్రమ ఇసుక వ్యవహారం కొంతమంది కూటమి నేతలు అండదండలతో యథేచ్ఛగా సాగుతున్నట్లు సమాచారం. అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. అక్రమంగా రవాణా చేసినట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ అధికారుల మాటలను అక్రమార్కులు బేఖాతరు చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
కడుము, కడుము కాలనీ, వసప గ్రామాల వద్ద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వసప వద్ద అక్రమ ఇసుక రవాణా జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. నదిలో నుంచి ఇసుక తవ్వకాలు జరగకుండా ఉండేందుకు కందకాలు తవ్వడం జరిగింది. ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ పట్టుబడితే కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటాం.
– కె.బాలకృష్ణ, తహసీల్దార్, కొత్తూరు మండలం
పగలు డంపింగ్.. రాత్రి లోడింగ్..!


