ప్రాణనష్టం లేకుండా చూడాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: తుఫాన్ వల్ల ప్రాణ నష్టం లేకుండా, జిల్లా ప్రజలంతా సురక్షితంగా ఉండే విధంగా పనిచేయాలని, అత్యవసర పరిస్థితుల్లో ‘గోల్డెన్ అవర్’ను ఏ అధికారి వృథా చేయకుండా, మెరుగైన సేవలు అందించడానికి ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి కేవీఎన్ చక్రధర బాబు ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మోంథా’ తీవ్ర తుఫాన్ ఈ నెల 28వ తేదీన తీరం దాటనున్న నేపథ్యంలో ఆయన ఆదివారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇన్‌చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డిలతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కోస్టల్ జిల్లాలు హై అలర్ట్‌లో ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, తిత్లీ తుఫాను అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధమవ్వాలని చక్రధర బాబు స్పష్టం చేశారు.
ప్రమాదకర ప్రాంతాల నుంచి తక్షణమే తరలింపు
తుఫాన్‌ను ఎదుర్కోవడంలో నిర్లక్ష్యం పనికిరాదని, ప్రమాదకర ప్రాంతాలు గుర్తించి, సురక్షితం కాని ఇళ్లలోని ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని ప్రత్యేక అధికారి సూచించారు. గర్భిణులు, తీవ్రమైన వ్యాధులతో ఇబ్బంది పడు తున్న వారికి పోషకాహార మద్దతు ఇచ్చి, వారి భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ సిబ్బంది కూలిన చెట్ల ను తొలగించడానికి ట్రీ కట్టర్‌లు డీజిల్ నిల్వలు సిద్ధం చేసుకుని, తక్షణ స్పందనకు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
పారిశుద్ధ్యంపై దృష్టి
సహాయక చర్యల కోసం రేషన్ దుకాణాలకు పీడీఎస్ బియ్యాన్ని వీలైనంత త్వరగా పంపాలని చక్ర ధర బాబు ఆదేశించారు. ప్రత్యేక శిబిరాల్లో వంట, పాలు ఇతర అవసరాలు సిద్ధం చేయాలని సూచించారు. రైతులు పొలాల్లో నీరు నిలవకుండా చూసుకుని, పంట నష్టం తగ్గించాలని అన్నారు. వర్షాల తర్వాత పారిశుద్ధ్యం సవాలుగా మారుతుందని, వ్యాధులు ప్రబలకుండా చూడటానికి సిబ్బందిని సంసిద్ధం చేయాలని ఆయన కోరారు. 24/7 కంట్రోల్ రూమ్ పని చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లపై జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎస్పీలు ఆయనకు వివరణ ఇచ్చారు. రాబో యే మూడు రోజులు ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా, సెల్ ఫోన్ ఆపరేటర్లు విద్యుత్ సరఫరా వ్యవస్థ సహా అన్ని కీలక వ్యవస్థలు అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అధికారుల సూచనలను తప్పక పాటించాలని చక్రధరబాబు కోరారు.


