బీల భూముల్లో.. మొగలి పరిమళాలు
భలే ఆదాయం..
ఒడిశా నుంచి మొక్కలు..
● సిరులు కురిపిస్తున్న మొగలి పూలు ● ఒడిశా మొక్కలతో సాగు ● పెట్టుబడి లేని పంట కావడంతో ఆసక్తి చూపుతున్న రైతులు
కవిటి:
ఉద్దానం బీలప్రాంతంలో పంట భూములకు రక్షణగా ఏర్పాటు చేసుకున్న మొగలిచెట్లు రైతులకు పెట్టుబడి లేని ఆదాయవనరుగా మారాయి. ఏడాదిలో ఆరు నెలలకు పైగా మంచి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. పండగలు, ఇతర సీజన్‌లో ఒక్కో పువ్వు రూ.40 నుంచి రూ.42 వరకు అమ్ముడుపోతుంటాయి. ఇక్కడి రైతులు వేకువజామునే చేతిలో దొనికత్తి పట్టుకుని వెళ్లి మొగలిపూల సేకరణలో నిమగ్నమవుతుంటారు. అదృష్టం కలిసివస్తే ఒక్కోవ్యక్తి రోజుకు 20 పువ్వుల వరకు దొరుకుతాయి. ప్రభుత్వపోరంబోకు భూమిలోనివైతే ఎవరైనా కోసుకోవచ్చు. అదే రైతు తన తోటలో మొగలిచెట్లు నాట్లు వేస్తే వాటిని సదరు రైతు మాత్రమే కోయాల్సి ఉంటుంది.
ప్రత్నామ్నాయ పంటగా..
ఇటీవల కాలంలో రైతులు తమ భూముల్లో వరి, చోడి తదితర పంటలకు ప్రత్యామ్నాయంగా మొగలిపంట సాగుకే మొగ్గు చూపుతున్నారు. వర్షాధారంగా కవిటి ఉద్దానం బీలలోని చిత్తడి నేలల్లో నీటి ఊ టలే పదునుగా మొగలి పంట వస్తోంది. ఇప్పటికే కొంతమంది రైతులు తమ భూముల్లో మొగలి డొంకల్ని పెంచుతున్నారు. వారి వద్ద నుంచి పంట కోసుకునేందుకు ఏడాదికి కొంత మొత్తం చెల్లించి కాంట్రాక్ట్ పొందుతారు. అలా రైతుల భూములు లీజుకు తీసుకున్న కొందరు ఇదే పంటపై మంచి ఆదాయం పొందుతున్నారు.
స్వల్పవ్యవధిలో ఏపుగా పెరిగే మొక్కల కోసం పొరుగు రాష్ట్రం ఒడిశాకు వెళ్లి నాణ్యమైన మొగలి అంట్లను కూడా ఇక్క డికి తీసుకొస్తున్నారు. మన వద్ద లభించే మొగలి మొక్కల కన్నా ఒడిశా మొక్కల నుంచి వచ్చే పూల కు గిరాకీ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. వీరంతా ఇక్కడి నుంచి ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో ఒడిశా వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.
కపాసుకుద్థి రెవెన్యూలో రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఇందులో రెండు ఎకరాలలో వరిసాగు చేస్తున్నాం. మిగిలిన 30 సెంట్ల భూమిలో గట్టు చుట్టూ మొగలి మొక్కలు నాటాం. ఏడాది కి రూ.40,000 లీజుకు కుదుర్చుకోవడం ద్వారా మొగలిపంట నుంచి ఆదాయం వస్తోంది.
– ఆరంగి శివాజీ, చిక్కాఫ్ సంస్థ ఎండీ, ముత్యాలపేట
కొబ్బరి, వరికి ప్రత్యామ్నాయంగా ఒడిశా వెళ్లి మొగలి అంట్లు తెచ్చినాటాను. బాగా ఎదిగేందుకు ఆవుపేడ మొదళ్లలో వేశాను. మొక్కలు చక్కగా పెరిగాయి. బాగా కలిసి వస్తుందనే నమ్మకంతో మొగలిసాగు చేసేందుకు నిర్ణయం తీసుకున్నాను. – బంజు పాపారావు,
మొగలిసాగుదారు, కె.కపాసుకుద్ధి
బీల భూముల్లో.. మొగలి పరిమళాలు


