బీజేపీ ఎమ్మెల్యేతో నాకు ప్రాణహాని
రణస్థలం: ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావుతో తనకు ప్రాణహాని ఉందని రణస్థలం మండలం బంటుపల్లిలో పాశపు శ్రీనివాసరావు అనే టీడీపీ కార్యకర్త ఆందోళన వ్యక్తం చేశారు. తన భూమిని లాక్కునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. బంటుపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 26/9లో 3.71 ఎకరాల భూమిపై తన కుటుంబం, కొరిపిల్లి రాధాకుమారి కుటుంబాల మధ్య వివాదం ఉండగా, ఈ సమస్య ఇప్పటికే న్యాయస్థానంలో ఉందన్నారు. భూమిలో ఉన్న జీడి, టేకు చెట్లను పొందూరు మండలంలోని బొట్లపేటకు చెందిన గురాల సుమంత్, రణస్థలం మండలంలోని యాగాటిపాలేనికి చెందిన కొరిపల్లి రాధాకుమారి, కొరిపల్లి శ్రీనివాసరావు, కొరిపల్లి వీరబాబులు 15 రోజుల కిందట దౌర్జన్యంగా నరికివేశారని తెలిపారు. ఈ నెల 13న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అధికారులు చెట్ల నరికివేతను నిలిపివేసినప్పటికీ, మళ్లీ గురువారం చెట్లను నరికి కలప తరలించుకుపోయారన్నారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే తన భూమిని కబ్జా చేసేందుకు పన్నాగం పన్నుతున్నారని, అందుకు పోలీసులు సహకరిస్తున్నారని శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేతో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. చెట్లు కొట్టిన వ్యక్తికి, భూమికి ఎలాంటి సంబంధం లేదన్నారు. దీనిపై గురాల సుమంత్ స్పందిస్తూ అగ్రిమెంట్ ప్రకారం ప్రస్తుతం భూమి తన ఆధీనంలో ఉందన్నారు. ఎమ్మెల్యేకు సంబంధం లేదని, తనకు అడ్డొస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు.
బీజేపీ ఎమ్మెల్యేతో నాకు ప్రాణహాని


