బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి
● అవగాహన కల్పిస్తున్నా ఫలితం ఉండడం లేదు ● సైబర్ నేరాల్లో పురోగతి లేదు ● డీఐజీ గోపీనాథ్ జెట్టి
శ్రీకాకుళం క్రైమ్ : గ్రామాల్లో, విద్యా సంస్థల్లో ఎంతగా అవగాహన కల్పిస్తున్నా బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని విశాఖపట్నం రేంజి డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. తెలిసిన వారే ఈ అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రెండో పట్టణ పీఎస్, సబ్‌డివిజనల్ కార్యాలయం, ట్రాఫిక్ పీఎస్‌లే కాక లావేరు పీఎస్‌లను ఆయన గురువారం తనిఖీ చేశా రు. గంజాయి కేసుల్లో ప్రధాన మూలాలను గుర్తించి చెక్‌పోస్టుల పనితీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. అనంతరం రెండో పట్టణ పీఎస్‌లో విలేకరులతో మాట్లాడారు.
గంజాయి, డ్రగ్స్ మత్తులో బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు రేంజ్ పరిధిలో జరగలేదని స్పష్టం చేశారు. ఫేక్ ఐడీ, ప్రొఫెల్ క్రియేట్ చేసి సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారా లు చేస్తున్నవారిపై కఠిన చర్యలుంటాయని, సైబర్ నేరాల కేసులు తక్కువని, ఫ్రాడ్స్ ఎక్కువవుతున్నా యని, పురోగతి లేదన్న వాస్తవం నిజమని డీఐజీ అన్నారు. ఫేక్ వాట్సాప్, ఇతర మాధ్యమాల్లో మెసేజ్‌ల పట్ల ఆకర్షితులై ఓటీపీలు చెప్పి మోసపోతున్నారని, ఎలాంటి మెయిల్స్‌కు స్పందించకుండా ప్రజ లు అప్రమత్తతతో మోసాలను తిప్పికొట్టాలన్నారు.
నక్సల్స్ ప్రభావం తక్కువే..
రేంజ్ పరిధిలో నక్సల్స్ ప్రభావం తక్కువేనని, ఎవరైనా ఉద్యమాల్లో ఉంటే ఇప్పటికే లొంగిపోవా లని పిలుపునిచ్చామన్నారు. జిల్లాకు చెందిన మా వోయిస్టు నేత దున్న కేశవ్ జనజీవన స్రవంతిలో కలిసిపోయినా ఒడిశా పోలీసులు 2011లో విచార ణ పేరిట పిలిచి జైలులో ఉంచి విచారణలో పురో గతి లేకుండా ఒకదాని వెంట ఒకటి కేసులపేరుతో జైలులోనే మగ్గిపోయేలా చేస్తున్నారని, ఇటీవలే ఎనిమిది రోజులుగా ఆమరణ దీక్ష సైతం అదే జైలు లో చేశారని విలేకరులు డీఐజీ వద్ద ప్రస్తావించారు. కేసుల వివరాలు ప్రభుత్వం అడిగిందని, అదంతా కోర్టు పరిధిలో ఉందని డీఐజీ అన్నారు. కేశవ్‌పై 16 ఏపీలో, ఒడిశాలో 36 కేసులున్నట్లు సమాచారం. రెండో పట్టణ పీఎస్ పరిధిలో ప్రాపర్టీ నేరాల్లో పురోగతి లేకపోవడంతో స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు కొంత సమయం ఇచ్చి క్లియర్ చేయాలని సూచించామన్నారు.
డీఐజీ వచ్చిన రోజే..
హిరమండలంలోని ఓ ప్రైవేటు స్కూల్‌కు సంబంధించిన వ్యక్తే విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో 100కు డయల్ చేసి ఫిర్యాదు ఇచ్చారు. హుటాహుటిన టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు, కొత్తూరు సీఐ ప్రసాద్ ఘటనాస్థలికి వెళ్లారు. నిందితునిపై పోక్సో నమోదైనట్లు అక్కడ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.


