‘మెడికల్ సీట్లు అమ్ముకోవడానికే ప్రైవేటీకరణ’
కోటబొమ్మాళి మండలంలో నిర్వహించిన రచ్చబండలో మాజీ స్పీకర్ తమ్మినేని
టెక్కలి: కాలేజీలను ప్రైవేటీకరించి మెడికల్ సీట్లు అమ్ముకోవడానికి సీఎం చంద్రబాబు పన్నాగం పన్నుతున్నారని వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి, దంత, సరియాపల్లి గ్రామాల్లో నియోజకవర్గ ఇన్‌చార్జి పేరా డ తిలక్ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ–కోటిసంతకాల సేకరణ కార్యక్రమంలో ముఖ్య అతి థిగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్రంలో వైద్యం పరిస్థితి దయనీయంగా మార్చేశారని, ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలిపివేశారని తమ్మినేని దుయ్యబట్టారు. కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారని, ఆధారాలతో సహా పట్టుబడినప్పటికీ వారిని అరెస్టు చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా 75 వేల బెల్టు దుకాణాలతో గ్రామాల్లో కుటుంబాలను నాశనం చేస్తున్నారని, ఇలాంటి ప్రభుత్వానికి మహిళలే గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు.


