ఏడు రోజుల పాటు రథసప్తమి మహోత్సవాలు
అరసవల్లి: వచ్చే ఏడాది జనవరి 25 నుంచి రథసప్తమి మహోత్సవాలను ఏడు రోజుల పాటు ‘శ్రీకాకుళం ఉత్సవ్’ పేరిట నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. గురువారం సాయంత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయ ప్రగతిపై ఆయన ఆలయ అధికారులు, జిల్లా అధికారుల సమక్షంలో సమీక్షించారు. ‘ప్రసాద్’ స్కీమ్ నిధుల మంజూరు అంశం మరింత ఆలస్యమవుతోందని, ఈలోగా ఆదిత్యాలయ నిధులు రూ.12 కోట్ల తో అభివృద్ధి పనులు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఏజెన్సీపై టెండర్ నిబంధనల ప్రకారం వెంటనే ఆమోదించాలని, అలాగే ఇంతవరకు విధులు నిర్వర్తించిన సిబ్బందికి జీతాలు చెల్లించాలని ఆదేశించారు. అనంతరం ఆలయానికి భవిష్యత్ అవసరాల దృష్ట్యా చుట్టుప్రక్కల పరిసరాల స్థలాలను ఆలయ నిధులతో కొనుగోలు చేయడమో లేదా, అవసరమైతే ప్రత్యామ్నాయంగా ఇతర చోట్ల ఉన్న ఆలయ స్థలాలను వారికి అప్పగించడమో చేయాలని ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్‌కు సూచించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీవో సాయి ప్రత్యూష, ఎస్‌ఈ డాక్టర్ పొగిరి సుగుణాకరరావు తదితరులు పాల్గొన్నారు.


