
బినామీలకు కట్టబెట్టేందుకే ప్రైవేటీకరణ
● మెడికల్ కళాశాలల
కోసం కలిసికట్టుగా ఉద్యమించాలి
● కోటి సంతకాల సేకరణలో మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్, మాజీ స్పీకర్ సీతారాం, మాజీ మంత్రి అప్పలరాజు
వజ్రపుకొత్తూరు/మందస : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకించాలని, అందుకూ ప్రతిఒక్కరూ ఉద్యమించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. బుధవారం మందస మండలం హొన్నాళిలో సర్పంచ్ త్రినాథ్ గౌడు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రతిపేదవాడికీ వైద్యం అందాలన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం సాకారం అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు తన బినామీలకు, పెత్తందారులకు కట్టబెట్టేందుకు పూనుకున్నారని మండిపడ్డారు. దీనిని వ్యతిరేకిస్తూ ఈ నెల 28న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టబోయే భారీ ర్యాలీల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
● మాజీ స్పీకర్, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులు సీట్లు కోల్పోయే ప్రమాదముందన్నారు. మెడికల్ కళాశాలల నిర్మాణానికి 40 శాతం రాయితీ ఉందని, అవి పూర్తి కావాలంటే రూ.3వేల కోట్లు సరిపోతాయని, అయినప్పటికీ కూటమి ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. ఇప్పటికే విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్ రూ.4800 కోట్లు బకాయిపడ్డారని చెప్పారు.
● మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ప్రతిఒక్కరికీ తమ పిల్లలను డాక్టర్లు, ఇంజినీర్లను చేయాలన్న ఆలోచన ఉంటుందని, అయితే రాష్ట్రంలో అందుకు తగ్గ సీట్లు లేవని చెప్పారు. 1995 తర్వాత రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కళాశాల కూడా తేలేదన్నారు. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక శ్రీకాకుళంలోని బలగ ఆస్పత్రిని మెడికల్ కళాశాలగా చేశారని గుర్తు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ఆవశ్యకత చెబితే దేశంలో ఎక్కడా లేని విధంగా 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేశారని, అందులో ఐదు పూర్తి చేశారని, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. పేదల ఆస్తులను అమ్మేందుకు చంద్రబాబు పూనుకున్నారని, అందులో భాగంగా మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారని మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దుంపల లక్ష్మణరావు, మందస ఎంపీపీ డొక్కరి దానయ్య, మండల పార్టీ అధ్యక్షుడు దల్లి జానకిరెడ్డి, ఉపాధ్యక్షుడు పీతాంబరం, జెడ్పీటీసీ సవర చంద్రమ్మ, మాజీ జెడ్పీటీసీ అందాల శేషగిరి, జిల్లా కార్యదర్శి అగ్గున్న సూరి, వైస్ ఎంపీపీలు సీర ప్రసాద్, ఆదినారాయణ, నియోజకవర్గ ఐటీ విభాగం అధ్యక్షుడు లక్ష్మణ్, యువజన అధ్యక్షుడు దున్న హరికృష్ణ, డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు మట్ట జయరాం, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఎం.రామకృష్ణ, రాపాక శేషగిరిరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు దివ్య, చింతాడ గణపతి, కిషోర్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి జీవన్, యువనేత హేమరాజు, సోషల్ మీడియా కన్వీనర్ రామారావు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బినామీలకు కట్టబెట్టేందుకే ప్రైవేటీకరణ