
రూ. 2,928.90 కోట్లతో సూక్ష్మరుణ ప్రణాళిక
పొందూరు: జిల్లాలో డ్వాక్రా గ్రూపు సంఘాలకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.2,928.90 కోట్లతో సూక్ష్మరుణ ప్రణాళిక రూపొందించినట్లు డీఆర్‌డీఏ పీడీ పి.కిరణ్‌కుమార్ తెలిపారు. సూక్ష్మరుణ ప్రణాళిక లక్ష్యంపై వీవోలు, సీఎస్‌లు, సీసీలతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా ఇప్పటికే రూ.2,356 కోట్లు రుణాలు మంజూరు చేయించినట్లు తెలిపారు. సమీక్షలో డీపీఎం మోహనరావు, ఏపీఎంలు జి.శ్యామలరావు, రామ్మూర్తి, సీసీలు, సీఎఫ్‌లు పాల్గొన్నారు.
పాలకొండకు బస్సుల్లేవ్!
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బుధవారం సాయంత్రం గందరగోళం నెలకొంది. పాలకొండకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో విద్యార్థులు, ప్రయాణికులు గంటల తరబడి వేచి చూశారు. చీకటిపడినా బస్సులు రాకపోవడంతో పడిగాపులు కాశారు. కొత్తరోడ్– రాగోలు మధ్య చిన్న వంతెన వద్ద ట్రాఫిక్ జామ్ కారణంగా బస్సులన్నీ అక్కడే ఉండిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. చాలాసేపటి తర్వాత మూడు బస్సులు ఒకేసారి రావడంతో అందరూ సీట్ల కోసం పరుగులు పెట్టారు.
పనులు ప్రారంభించకపోతే రీ టెండర్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జల జీవన్ మిషన్ (జేజేఎం) కింద చేపట్టిన పనుల్లో అగ్రిమెంట్ సమయం పూర్తయినా, ఇంతవరకు ప్రారంభించని కాంట్రాక్టులను రద్దు చేస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జేజేఎం పనులపై సమీక్ష నిర్వహించారు. వెంటనే పనులు ప్రారంభించకపోతే, ఆ కాంట్రాక్టులను రద్దు చేసి, రీ–టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఎంతమాత్రం సహించబోమని, ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేశారు. జిల్లాలో 4,87,307 ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికీ 2,56,499 కనెక్షన్లు పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఈ నెలాఖరులోగా పనుల వేగాన్ని పెంచకపోతే, సంబంధిత అధికారులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీపీఓ భారతి సౌజన్య, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్లు పాల్గొన్నారు.