
పేదలకు ఉచిత వైద్యం
● ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమ నిర్ణయం
● కోటి సంతకాల సేకరణలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రైవేటీకరణ
అడ్డుకుంటేనే
శ్రీకాకుళం రూరల్: ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజల తీర్పే అంతిమ నిర్ణయమని, ఇలాంటి తీర్పుతోనే వైద్య విద్య ప్రైవేటీకరణను అడ్డుకుందామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. పెదపాడులోని నియోజకవర్గ (ధర్మాన క్యాంప్) కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు చిట్టి జనార్దన్‌రావు అధ్యక్షతన నియోజకవర్గ సమావేశం, కోటి సంతకాల సేకరణ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి శ్రీకాకుళం నియోజకవర్గంలో చేపట్టనున్న కోటి సంతకాల సేకరణకు పార్టీ నాయకులు, కార్యకర్తలు నడుం బిగించాలన్నారు. 60 వేలు సంతకాలు చేయించే దిశగా ప్రతిఒక్కరూ సమాయత్తం కావాలన్నారు.
కోటరీ కోసమే పీపీపీ
సీఎం చంద్రబాబు వ్యక్తిగత స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారని, తన కోటరీ నాయకులకు పీపీపీ విధానాన్ని కట్టబెట్టేందుకు చట్టం చేయడం, దాన్ని అమలు చేయడం వంటి అనైతిక చర్యలకు పూనకుంటున్నారని ధర్మాన మండిపడ్డారు. పీపీపీ విధానంతో పేదలు నష్టపోతారని, అటువంటి వారి పిల్లలు వైద్య విద్యను అభ్యసించడం కలగా మిగిలిపోతుందన్నారు. ఈ నేపథ్యంలో కోటి సంతకాలతో ప్రజలను చైతన్యపరచాలన్నారు. ప్రభుత్వ వైద్యం, విద్యను ప్రైవేట్‌పరం చేస్తే భవిష్యత్‌తరం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే రకరకాల కులాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు.
తారస్థాయికి వ్యతిరేకత..
రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలనపై వ్యతిరేకత తారస్థాయికి చేరిందని ధర్మాన పేర్కొన్నారు. చంద్రబాబు తన వక్రబుద్ధిని పేదప్రజలపై చూపిస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని బైరి, అలికాం, నైరా, కుందువానిపేట గ్రామాల్లో పెన్షన్‌కు అర్హత సాధించిన పింఛన్ అందకుండా అడ్డుపడటం సిగ్గుచేటన్నారు. నాలుగు మెతుకులు పేదవాడి నోటికి వెళ్లాలంటే పెన్షనే ఆధారమని గుర్తు చేశారు. పీపీపీ ద్వారా పేదవాడికి వైద్యవిద్యను దూరం చేస్తున్న టీడీపీ కుటిల కుట్రలు, కక్షపూరిత రాజకీయాలను బయటపెట్టేందుకు కోటి సంతకాలు సేకరణ చేపట్టి గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని ధర్మాన వివరించారు.
● యువ నాయకుడు ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు మాట్లాడుతూ సీనియర్లు, జూనియర్లు కలిసి ఈ నెల 24న కోటి సంతకాల సేకరణ డివిజన్లు, గ్రామాల వారీగా సేకరించాలన్నారు.28న పార్టీ ఆదేశాల మేరకు ర్యాలీలు, నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, కళింగవైశ్యకుల, తూర్పుకాపు, వెలమ కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, అంబటి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా శ్రీను, గొండు కృష్ణమూర్తి, పార్టీ సీనియర్ నాయకులు ఎం.వి.పద్మావతి, సాధు వైకుంఠరావు, ఎన్ని ధనుంజయ, మార్పు పృథ్వీ, గొండు రఘురామ్, మూకళ్ల తాతబాబు, చల్లా రవికుమార్, రౌతు శంకరావు, పీస గోపి, ముంజేటి కృష్ణమూర్తి, కామేశ్వరి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీకాకుళం నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు